సామీ.. త్రివిక్రమ సామీ..
తమరిని మించిన సార్థక నామధేయుడు నా కంటికి మరొకరు అగుపించడం లేదు సామీ. నీది అచ్చంగా త్రివిక్రమావతారమే సామీ! నీ అసలు అవతారం రైటరే గద. ఆనక డైరక్టరు అవతారంలోకి ఎంటరైనావు గద. ఆనక, యిప్పుడు పొలిటికల్ స్పీచులు వండే మూడో అవతారాన్ని గూడా యిరగదీస్తన్నావు సామీ! అసలు సిసలు పదారణాలు త్రివిక్రముడివి నువ్వే గదా! ఏదైనా డౌటా?
తమకి తెలవని నీతి ఏముండాది సామీ! తమరు ఎరగని రీతి ఏముండాది? కన్నాలేసే వోళ్లు కన్నాలే యెయ్యాల. సున్నాలేసే వోళ్లు సున్నాలే యెయ్యాల! ఏదైతే ఏముండాదబ్బా.. యేదైనా సరే గోడమీద యేసేదే గదా అంటే ఎట్టా? కన్నాలను గునపంతో యేస్తాం.. సున్నాలను చీపురుతోనో, బ్రష్షుతోనో యేస్తాం.. యీ రెండింటికీ తేడా వుండాది గదా!
సినిమా డైలాగుల్లో ఎలాంటి పంచులు యేసినా నడస్తాది సామీ. అక్కడేముండాది జెనం దుడ్లు యిచ్చి వొచ్చి చూస్తారు.. నీ పంచులను ఎంజాయి జేసి నవ్వుకోని యెల్లిపోతారు. కానీ పొలిటికల్ సీను అట్టా గాదు సామీ. జెనాల్ని గూడా మనమే డబ్బులు యిచ్చి తోలుకోని రావాల. ఆడతో అయిపోతందా..! పంచులు మాటాడేసిన తర్వాత.. అందరూ గలిసి ఆ పంచుల్ని కెలకతా వుంటారు. ఈకలు పీకతా ఉంటారు. యే కొంచిం తేడా గొట్టినా పంచు కంచికెల్తాది. పరువు సంతకెల్తాది!
యింతకీ, నీ సామి- అదే సామీ.. నీ పవన్ కల్యాణ్ సామి.. చంద్రబాబు యేదో ముష్టేసినట్టుగా 24 సీట్లను యిదిలిస్తే.. అక్కడికేదో మహదానందపడిపోతా, అదే నా వ్యూహం అని రొమ్మిరిసుకోని జెప్పుకుంటూ మురిసిపోతన్నాడు గదా. ఆ మురిసిపాటును నువ్వెందుకు సామీ మిడిసిపాటుగా మార్చేస్తండావు. గాయత్రీ మంత్రంలో గూడా ఇరవై నాలుగు అచ్చరాలే ఉంటాయని యెందుకు సామీ పంచు డైలాగులు రాసిస్తా వుండావు. నీ పేరులో ఉండే త్రివిక్రమావతారాన్ని నీ సామికి పులిమేసి.. బలిని తొక్కినట్టుగా జగన్ ను పాతాళానికి తొక్కేస్తానని యెందుకు సామీ ఎగస్ట్రా డైలాగులు పలికిస్తా వుండావు. నీ సామి పరువును యే గంగలో కలపాలని డిసైడైనావు?
ఇరవై నాలుగు అంటే గాయత్రీమంత్రంతో పోలిక తెచ్చేస్తివి. అసలు మంత్రంలో ఎన్ని అచ్చరాలుండాయో లెక్క జూసుకోకుండా.. చతుర్వింశతి అనే పదాన్ని పట్టుకోని స్పీచు రాసేస్తివి. అట్టాగాకుండా చంద్రబాబు పది సీట్లే ముష్టేసినాడనుకో.. అప్పుడు దశావతారాలనీ, తొమ్మిది అయితే నవగ్రహాలనీ, ఎనిమిది అయితే అష్ట దిక్పాలకులనీ, ఏడే అయితే సప్తరుషులనీ, ఆరే అయితే షట్చక్రవర్తులు అనీ, అయిదే అయితే పంచభూతాలనీ, నాలుగే అయితే నాలుగు వేదాలని, మూడే ఇస్తే త్రిమూర్తులనీ, రెండే ఇస్తే నరనారాయణులనీ, ఒకటే ఇస్తే ఏకేశ్వరుడని, సున్నా ఇస్తే.. అంతా మిథ్య అని దానిని సపోర్టింగు జేసుకుంటా స్క్రిప్టు రాసిచ్చేస్తావా యెట్టా?
పవరు స్టారు అని తనకు తానే తగిలించుకోని యింత పెద్ద సినిమా హీరోగా యెలిగేటోడిని ఇలాంటి డైలాగులతో జెనాల ముందు కమెడియనుగా మార్చేస్తండావు యెందుకు సామీ!
అయినా తప్పు నీది గాదులే. త్రివిక్రము అని పేరు పెట్టుకున్నందుకు.. మొదటి రెండూ ఒగ్గేసి.. పొలిటికల్ స్పీచు రైటరుగా మూడో అవతారం మీద మోజు పడినప్పుడే.. నీ టేలెంటుకు గ్రహణం పట్టింది. లేపోతే ఏంటిసామీ.. సుబ్బరమైన సినిమా రాసి యెంతకాలం అవతండాది. ఆడా యీడా కాపీ కొట్టకుండా.. జంధ్యాల సినిమాల్లో డైలాగులకు కాపీయింగ్ జెయ్యకుండా, ఇంగ్లిషు సినిమాల్లో సీన్లకి రీకన్స్ట్రక్షను జెయ్యకుండా సినీ జనమెత్తినాక యెన్ని సినిమాలు రాసినావో ఓపాలి యెనక్కి లుక్కేసుకో సామీ!
అసలే తమరికి నికరంగా రెండున్నర గంటల నిడివికి కత చెప్పడం తెలీదంటే తెలీదని ఇండస్ట్రీలో జెనం నీ యెనకమాల నవ్వుకుంటా వుంటారు. అంత పొడవు కత వండలేక జల్సాలో నక్సలైట్ల మాదిరిగా, అత్తారింటికి దారేదిలో అహల్య మాదిరిగా అతుకుడు ఎపిసోడ్లతో బండి లాగించే నువ్వు ఏదో నికరంగా ‘అ ఆ’ లాంటి సినిమా ఒకటి రాశావు గదా అనుకుంటే అది కాస్తా నవల కాపీ అని పరువు పోయింది గదా! ఆడా యీడీ లేపుకొచ్చిన డైలాగులు, కత్తిరింపులేసిన డైలాగులతో.. నీ సినిమా స్క్రిప్టులు టైలరు కూతురు యేసుకునే అతుకుల గౌనుల్లాగా వుండాయని యెవురైనా నవ్వితే తప్పేముండాది.
ఏ రొవంతయినా కాపీ అనిపించుకోకుండా, ఒక్క సినిమానైనా నికార్సుగా రాయి సామీ! తొలి రెండు పడవలు పర్లేదు.. అతుకు వుండేవే అనుకో. కానీ, మూడో పడవ మీద గూడా కాలు పెట్టి అవతవక అపభ్రంశపు వంటకాలను వండి వార్చడం యెందుకు. నీ పంచుల్ని, నీ సామి పలికినంత మాత్రాన, సినిమా చూసే జెనం ఊగినట్టుగా, ఓట్లేసే జెనం ఊగిపోరు సామీ. ముందు ఆ సంగతి తెలుసుకో. లేకపోతే బైసాట్లు!