వచ్చే ఏడాది సంక్రాంతికి మరో సినిమా రెడీ

2025 సంక్రాంతికి కర్చీఫులు వేసే కార్యక్రమం ప్రారంభమై చాలా రోజులైంది. దిల్ రాజు తన ప్రతిష్టాత్మక సినిమా శతమానంభవతి సినిమాకు సీక్వెల్ ప్రకటించారు. వచ్చే ఏడాది సంక్రాంతికి 'శతమానంభవతి నెక్ట్స్ పేజ్' రిలీజ్ అని…

2025 సంక్రాంతికి కర్చీఫులు వేసే కార్యక్రమం ప్రారంభమై చాలా రోజులైంది. దిల్ రాజు తన ప్రతిష్టాత్మక సినిమా శతమానంభవతి సినిమాకు సీక్వెల్ ప్రకటించారు. వచ్చే ఏడాది సంక్రాంతికి 'శతమానంభవతి నెక్ట్స్ పేజ్' రిలీజ్ అని కూడా చెప్పేశారు. ఇక చిరంజీవి కూడా తన కొత్త సినిమా విశ్వంభరను సంక్రాంతికి తీసుకురాబోతున్నారు. ఈ ప్రకటన కూడా అధికారికంగా వచ్చేసింది.

ఇప్పుడు లిస్ట్ లోకి మరో సినిమా వచ్చి చేరింది. ఈసారి వెంకటేశ్ వంతు. త్వరలోనే అనీల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు వెంకీ. ఈ సినిమాకు 'సంక్రాంతికి వస్తున్నాం' అనే టైటిల్ రిజిస్టర్ చేయించారు. టైటిల్ లోనే మొత్తం చెప్పేశారుగా.. అంతేగా.. అంతేగా అనుకోవాల్సిందే!

అనీల్ కు సంక్రాంతి బరిలో మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. ఎఫ్2, సరిలేరు నీకెవ్వరు లాంటి హిట్స్ ఇచ్చాడు. ఇక వెంకటేష్ సంక్రాంతి ట్రాక్ రికార్డ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకట్రెండు సార్లు మినహాయిస్తే, సంక్రాంతికొచ్చిన ప్రతిసారి వెంకీ హిట్ కొట్టారు. ఇప్పుడీ ఇద్దరూ కలిసి మరోసారి సంక్రాంతిపై కన్నేశారు. ఏకంగా 'సంక్రాంతికి వస్తున్నాం' అనే టైటిల్ తోనే సంక్రాంతి బరిలో నిలిచారు.

ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ నడుస్తోంది. త్వరలోనే తనదైన శైలిలో వినూత్నంగా ఈ ప్రాజెక్టును ప్రకటించబోతున్నాడు దర్శకుడు అనీల్ రావిపూడి.