డిజేబులిటీ ఉద్యోగులకు ఎన్నికల విధులు కేటాయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 90 శాతం డిజేబులిటీ ఉన్న వారినీ కూడా ఎన్నికల బాధ్యతలు అప్పగించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కనీస మానవతా దృక్పథం లేకుండా అధికారులు ఇష్టారీతిలో ఎన్నికల డ్యూటీలు వేయడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ఇప్పటికే విభిన్న ప్రతిభావంతుల విభాగం ఎన్నికల సంఘానికి ఓ లేఖ రాసింది. డిజేబులిటీతో బాధపడుతున్న వారికి ఎన్నికల విధులు అప్పగించకూడదని విజ్ఞప్తి చేస్తూ లేఖ పంపింది. కనీసం 30, 40 శాతం డిజేబులిటీతో బాధపడుతున్న వారికి ఎన్నికల బాధ్యతలు అప్పగిస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ 50 శాతానికి మించి వైకల్యంతో అవస్థలు పడుతున్న వారికి కూడా ఎన్నికల బాధ్యతలు అప్పగించడంతో ఎన్నికల సంఘంపై మండిపడుతున్నారు.
50 శాతానికి పైబడి శారీరక వైకల్యంతో బాధపడుతున్న వారిని ఎన్నికల విధులకు వేయడం వల్ల, ఆయా పోలింగ్ కేంద్రాల్లో కనీస వసతులు కూడా లేకపోతే ఎన్ని రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందో అర్థం చేసుకోరా? అని ప్రశ్నిస్తున్నారు.
ఇప్పటికైనా డిజేబులిటీతో బాధపడుతున్న చిన్నాపెద్దా ఉద్యోగుల సమస్యలను అర్థం చేసుకుని , ఎన్నికల విధులకు దూరం పెట్టాలనే డిమాండ్ వెల్లువెత్తుతోంది. ఎన్నికల సంఘం వారి విజ్ఞప్తిని మానవీయ కోణంలో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది.