ఇప్పుడున్న యంగ్ దర్శకులు సీనియర్ హీరోలైన రజనీకాంత్, చిరంజీవి లాంటి వాళ్లను డైరక్ట్ చేయడం ఒక సవాల్. ఎందుకంటే, దశాబ్దాల అనుభవం వాళ్ల సొంతం, వాళ్ల సినిమాలపై భారీ అంచనాలుంటాయి.
అయితే అలాంటి యంగ్ డైరక్టర్లపైన ఆధారపడడమే మంచిదని అభిప్రాయపడ్డారు చిరంజీవి. తన లాంటి సీనియర్లను ఎలా చూపించాలో యంగ్ దర్శకులకు బాగా తెలుస్తుందని, ఈ విషయాన్ని రజనీకాంత్ తనతో చెప్పారని, అదే తను ఫాలో అవుతున్నానని అన్నారు.
“ఓ సందర్భంలో నేను, రజనీకాంత్ మాట్లాడుకున్నాం. అప్పుడు ఆయన ఓ మాటన్నారు. మనం పని చేయాలనుకున్న లెజెండరీ దర్శకులు ఇప్పుడు లేరు. ఇప్పుడంతా కొత్త దర్శకులు వస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఆ దర్శకుల్లో మన ఫ్యాన్స్ ఎవరో తెలుసుకొని, సింపుల్ గా వాళ్లపై ఆధారపడడం మంచిది. మనల్ని ఎలా మార్చాలి, ఎలా చూపించాలనేది మనకంటే వాళ్లకు బాగా తెలుసు. దాన్ని నేను పాటిస్తున్నాను.”
రజనీకాంత్ మాటలు పాటించడం వల్ల బాబితో వాల్తేరు వీరయ్య లాంటి సక్సెస్ ఇవ్వగలిగానని, ప్రస్తుతం వశిష్ఠతో ఓ మంచి స్టోరీ చేయగలుగుతున్నానని అన్నారు చిరంజీవి. మంచి కంటెంట్ తో వస్తే, రాబోయే రోజుల్లో మరింతమంది యంగ్ దర్శకులతో కలిసి పనిచేస్తానని అన్నారు.