జనసేనాని పవన్‌కల్యాణ్‌పై ఉభయ గోదావరి జిల్లాల వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తనను ఓడించడానికి మిథున్‌రెడ్డి తిష్ట వేశారని ఇటీవల పవన్‌కల్యాణ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాకినాడలో మీడియాతో మిథున్‌రెడ్డి మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశారు. పిఠాపురంపై తాము ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం లేదన్నారు.
175 నియోజకవర్గాల్లో పిఠాపురం కూడా ఒకటన్నారు. పిఠాపురంలో వైసీపీ బలంగా వుందన్నారు. పవన్‌కల్యాణ్ పిఠాపురానికి వెళ్లక ముందే వంగా గీత అక్కడ అభ్యర్థి అన్నారు. పిఠాపురం ఎమ్మెల్యేగా ఆమె సేవలందించారని గుర్తు చేశారు. అందరికీ అందుబాటులో వుండే నేత కావాలని ప్రజలు కోరుకుంటారన్నారు. తమ అభ్యర్థి వంగా గీత నిత్యం ప్రజలకు అందుబాటులో వుంటూ, వారికి సేవలు అందిస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు.
ఓడిపోతే చెప్పుకోడానికి పవన్‌కల్యాణ్ సాకులు వెతుకుతున్నారని మిథున్‌రెడ్డి అన్నారు. పిఠాపురంలో పవనే కష్టపడాల్సి వుంటుందన్నారు. తాము ఆయన్ను పట్టించుకోమని చెప్పారు. ఒక్కో ఓటరుకు లక్ష రూపాయలు వైసీపీ ఇస్తుందని పవన్ ఆరోపించడం విడ్డూరంగా వుందన్నారు. డబ్బు తీసుకుని సీట్లు ఇచ్చిందే పవన్‌కల్యాణ్ అని మిథున్‌రెడ్డి ఘాటు విమర్శ చేశారు.
పిలిస్తే పలికే నాయకులకే ప్రజలు ఓట్లు వేస్తారని ఆయన చెప్పారు. పవన్‌కల్యాణ్‌ను ఆయన కేడరే చేరుకోలేదన్నారు. పవన్ ఎప్పుడు ఎక్కడ వుంటాడో ఆయనకే తెలియదన్నారు. అలాంటి వ్యక్తిని ప్రజలు ఎన్నుకుంటారని తాను అనుకోవడం లేదన్నారు.