ఈ బంధాల సంగతేంటి?

ఉత్తరాంధ్రలో ఈసారి ఎన్నికల్లో కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పోటీ చేశారు. వారు బాబాయ్ అబ్బాయ్ భార్యాభర్తలు అన్న దమ్ములు తండ్రీ కూతుళ్ళు ఇలా ఒకే పార్టీలో ఉంటూ వేరు వేరు సీట్లలో తమ…

ఉత్తరాంధ్రలో ఈసారి ఎన్నికల్లో కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పోటీ చేశారు. వారు బాబాయ్ అబ్బాయ్ భార్యాభర్తలు అన్న దమ్ములు తండ్రీ కూతుళ్ళు ఇలా ఒకే పార్టీలో ఉంటూ వేరు వేరు సీట్లలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

ఉత్తరాంధ్రలో టీడీపీ ఏపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు  టెక్కలి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అబ్బాయి కింజరాపు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేశారు. ఈ ఇద్దరూ టీడీపీ నేతలుగా ఉన్నారు. ఇదే జిల్లాలో అన్న దమ్ములు అయిన ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం నుంచి ధర్మాన క్రిష్ణదాస్ నరసన్నపేట నుంచి ఎమ్మెల్యేలుగా పోటీ పడ్డారు. వైసీపీ నుంచి బరిలో ఉన్న ఈ ఇద్దరి రాజకీయ జాతకం ఎలా ఉంది అన్నది అంతా డిస్కషన్ చేస్తున్నారు.

విజయనగరం జిల్లాలో సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ చీపురుపల్లి నుంచి ఎమ్మెల్యేగా ఆయన సతీమణి బొత్స ఝాన్సీ విశాఖ ఎంపీగా వైసీపీ నుంచి పోటీ చేశారు. బొత్స తమ్ముడు బొత్స అప్పలనరసయ్య గజపతినగరం నుంచి పోటీ చేశారు.

ఉమ్మడి విశాఖలో చూస్తే అనకాపల్లి నుంచి ఎంపీగా వైసీపీ నుంచి బూడి ముత్యాలనాయుడు పోటీ చేశారు. ఆయన కుమార్తె అనూరాధ మాడుగుల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసారు. వీరంతా పోలింగ్ సరళిని సమీక్షించుకుంటున్నారు. ప్రజలు తమను ఎంతవరకూ ఆదరించారు అన్నది వారంతా తరచి చూసుకుంటున్నారు.

ఈసారి ఏ పార్టీకి బలమైన ప్రభంజనం ఉంటే ఆ పార్టీకి చెందిన వారంతా చాలా సులువుగా గెలిచేస్తారు అని అంటున్నారు. అలా చట్ట సభలలో వీరంతా కనిపించనున్నారు. మరికొంతమంది వేవ్ తో సంబంధం లేకపోయినా తన సొంత పలుకుబడితో గెలిచే సత్తా గలిగిన వారుగా ఉన్నారు. వీరందరిలో ఆత్యధికులు ఈసారి చట్టసభలకు నెగ్గుతారు అన్నది పార్టీలకు అతీతంగా వినిపిస్తున్న మాట.