విశాఖ ఉక్కు కర్మాగారం ఎన్నడూ లేనంత భారీ సంక్షోభాన్ని చూస్తోంది. మూడేళ్ళుగా ఉక్కు కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఇపుడు వాటికి అదనంగా మరిన్ని తోడు అయిపోయాయి. విశాఖ ఉక్కు కర్మాగారం పని చేయడానికి అవసరం అయిన బొగ్గు నిల్వలు అడుగంటాయి. నెల రోజులుగా ఇదే రకమైన సమస్యతో విశాఖ ఉక్కు నానా అవస్థలు పడుతోంది.
విశాఖ ఉక్కు కర్మాగారం తనకు అవసరం అయిన బొగ్గును వేరే ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. అలా దిగుమతి అయిన బొగ్గు షిప్పుల ద్వారా విశాఖలోని గంగవరం పోర్టు దాకా వచ్చి అక్కడ లంగరేసుకుని కూర్చుంది. గంగవరం కార్మికుల సమ్మె ఇతర కారణాల వల్ల లోడింగ్ అన్నది జరగడం లేదు. దాంతో ఆరు వందల కోట్ల విలువ చేసే బొగ్గు నిల్వలు పోర్టులోనే ఉండిపోయాయి. దీంతో ఉక్కు కర్మాగారం మీద తీవ్ర ప్రభావం పడింది. బొగ్గు నిల్వలు తగ్గిపోవడంతో ఉత్పత్తి సైతం గణనీయంగా పడిపోయింది.
ఉక్కు ఉత్పత్తి నెల రోజులుగా క్షీణ దశకు చేరుకొవడంతో ఆర్ధికంగా కూడా ఉక్కు ఇబ్బందుల్లో పడుతోంది. అది ఎంతవరకూ వచ్చిందంటే ఆఖరుకు ఉద్యోగుల జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి వచ్చేసింది. ఉక్కులో పనిచేసే ఉద్యోగులు కార్మికుల జీతాలు ఎపుడు చెల్లిస్తారు అన్నదే ఆందోళన కలిగిస్తోంది.
మార్చి నెలలో విద్యుత్ బకాయిలు చూస్తే 68.43 కోట్ల దాకా చేరుకున్నాయి. దీంతో ఉక్కు కార్మికుల ఆందోళనలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. కేంద్రంలో కొత్త ప్రభుత్వం జూన్ లో కొలువు తీరనుంది. బీజేపీ మూడవసారి అధికారంలోకి వస్తే ఉక్కు ప్రైవేటు ఖాయం అని అంతటా వార్తలు ప్రచారంలో ఉన్న నేపధ్యంలో దాని కంటే ముందే ఘనమైన పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో చిక్కుకుని పోవడం విశేషం.