ఏపీ సీఎస్ జవహర్‌రెడ్డిని బదిలీ చేయాలని ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి టీడీపీ, ఎల్లో మీడియా రాగాలాపన చేస్తున్నాయి. డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిని మాత్రం వారు కోరుకున్నట్టుగానే ఎన్నికల సంఘం బదిలీ చేసింది. ఆయన స్థానంలో హరీశ్‌కుమార్ గుప్తా వచ్చారు. చివర్లో డీజీపీని మార్చారనే అసంతృప్తి, అలాగే తమకు అనుకూలమైన పోలీస్ బాస్‌ను నియమించలేదనే కోపం ఎల్లో టీమ్‌లో చూడొచ్చు.
చివరికి ఎన్నికల ప్రక్రియ పూర్తయినా, సీఎస్‌ను బదిలీ చేయాలని పచ్చ బ్యాచ్ కోరుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎన్నికల తర్వాత ఏపీలో కొన్ని ప్రాంతాల్లో తీవ్రస్థాయిలో హింసకు పాల్పడ్డారు. దీన్ని కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్‌గా తీసుకుంది. ఢిల్లీకి వచ్చి వివరణ ఇవ్వాలంటూ సీఎస్, డీజీపీని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.
సీఎస్, డీజీపీ ఢిల్లీ వెళ్లారు. వీళ్లిద్దరిపై లేదా సీఎస్‌పై వేటు వేస్తారంటూ ఎల్లో మీడియా కథనాల్ని మరోసారి వండివార్చడం మొదలు పెట్టింది. అయితే సీఎస్ ప్రతిపాదన మేరకు ఇద్దరు ఎస్పీలను సస్పెండ్ చేయడం, అలాగే పల్నాడు కలెక్టర్, తిరుపతి ఎస్పీలపై బదిలీ వేటు వేశారు. మరికొందరు డీఎస్పీలు, సీఐలపై కూడా కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది.
ఈసీ నియమించిన చోటే అల్లర్లు జరగడం, వారిపైనే చర్యలు తీసుకోవడంతో ఎల్లో మీడియా కక్కలేక, మింగలేని పరిస్థితి. టీడీపీ, ఎల్లో మీడియా దృష్టిలో ఈ అల్లర్లకు ప్రధాన కారకుడు సీఎస్ జవహర్‌రెడ్డి. సీఎస్‌పై కదా చర్యలు తీసుకోవాల్సిందంటూ డిమాండ్ చేయడం గమనార్హం. కానీ సీఎస్ అభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకుని, ఆయనెంతో నమ్మదగిన అధికారిగా భావించే కేంద్ర ఎన్నికల సంఘం నివేదిక కోరడం, అలాగే చర్యలకు ఉపక్రమించడాన్ని చూడొచ్చు. సీఎస్ విషయంలో మాత్రం ఎల్లో బ్యాచ్ బాగా హర్ట్ అవుతున్నట్టు గా కనిపిస్తోంది. తాము చెప్పినా కేంద్ర ఎన్నికల సంఘం పట్టించుకోకపోవడం ఏంటని ఎల్లో టీమ్ ఆగ్రహిస్తోంది.