మైండ్‌గేమ్‌లో టీడీపీ, ఎల్లో మీడియా పెద్ద తోపులని ఇంతకాలం పేరు ఉండేది. ఇప్పుడు వాటిని వైసీపీ మించిపోయింది. ఎన్నికల సందర్భంలో వైసీపీ, కూటమి మధ్య సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే జరిగింది. ల్యాండ్ టైటిలింగ్, సామాజిక పింఛన్ల పంపిణీలో కూటమిని దోషిగా నిలబెట్టడంలోనూ వైసీపీ సక్సెస్ అయ్యింది.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ప్రచార సభల్లో చంద్రబాబు, పవన్ రెచ్చిపోతున్న సందర్భంలో, అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మద్దతు ఇస్తూ చేసిన ప్రసంగాన్ని వైసీపీ బయటికి తీసి, ఓ ఆట ఆడుకుంది. అలాగే ఈటీవీలోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ప్రసారమైన పాజిటివ్ కథనాన్ని బయటికి తీసి, ఎల్లో కుట్రల్ని బయట పెట్టడంలో వైసీపీ విజయం సాధించింది.
అలాగే వలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ అడ్డుకున్నది, అలాగే బ్యాంకుల్లో జమ చేయాలని చెప్పింది టీడీపీనే అని వైసీపీ ఆధారాలతో సహా బయట పెట్టింది. నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ఈసీకి ఫిర్యాదు అనంతరం మీడియాతో మాట్లాడుతూ… సామాజిక పింఛన్‌దారులకు బ్యాంక్ ఖాతాలు వుంటే డీబీటీ ద్వారా చెల్లింపులు చేయాలని, లేని వారికి నగదు పంపిణీ చేయాలని సూచించినట్టు చెప్పారు.
నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం పని చేస్తారో అందరికీ తెలుసు. ఈటీవీలో ప్రసారమైన నిమ్మగడ్డ ప్రెస్‌మీట్ వీడియోను సోషల్ మీడియాలో వైసీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసి, కూటమికి చుక్కలు చూపింది. కూటమికి రాజకీయంగా నష్టం జరుగుతోందని రాజగురువు పత్రిక లబోదిబోమంది.
ప్రస్తుతానికి వస్తే రాబోది తామే అంటూ ముఖ్యంగా టీడీపీ పెద్ద ఎత్తున బెట్టింగ్‌ల పేరుతో మైండ్ గేమ్‌కు తెరలేపింది. వైసీపీ శ్రేణులు ఆత్మరక్షణలో పడ్డారు. సరిగ్గా ఇదే సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎల్లో బ్యాచ్‌ను చావు దెబ్బతీసేలా ఎన్నికల ఫలితాలపై స్పందించారు.
ఐ ప్యాక్ టీమ్‌తో నిర్వహించిన సమావేశంలో 151కి పైగానే సీట్లు వస్తాయని, దేశమే ఆశ్చర్యపోయే ఫలితాలను చూస్తామని జగన్ ప్రకటించారు. దీంతో ఎల్లో టీమ్ కలవరపాటుకు గురవుతోంది. మరోవైపు మంత్రి బొత్స సత్యనారాయణ షాక్ ఇచ్చారు. జూన్ 9న విశాఖలో రెండోసారి జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రకటించి ప్రత్యర్థులను ఆత్మరక్షణలో పడేశారు. తద్వారా టీడీపీ మైండ్ గేమ్‌కు చెక్ పెట్టినట్టైంది. ఫలితాలు ఎలా ఉన్నా, అంతకు ముందు ఆడుతున్న డ్రామాలు ఓ రేంజ్లో ఉన్నాయి. కూటమి రెచ్చిపోతోందని, అందుకే వైసీపీ కూడా అదే ఆట ఆడక తప్పలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.