తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళిరెడ్డి అలియాస్ శివ (28) మృత్యువుతో పోరాటంలో చివరికి ఓడిపోయాడు. ఈ నెల 18న గుండె పోటుకు గురైన అతన్ని చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేర్పించారు. అత్యంత విషమ పరిస్థితుల్లో ఆస్పత్రికి చేరిన చంద్రమౌళిని కాపాడేందుకు వైద్యులు విశ్వ ప్రయత్నం చేశారు. చివరికి మృత్యువే పైచేయి సాధించింది.
ప్రముఖ పారిశ్రామికవేత్త, టీటీడీ చైన్నై స్థానిక సలహా మండలి అధ్యక్షుడు ఏజే శేఖరరెడ్డి కుమార్తెతో ధర్మారెడ్డి కుమారుడికి వివాహ నిశ్చయం చేశారు. కొన్ని నెలల క్రితం వాళ్లిద్దరికీ తిరుమలలో నిశ్చితార్థం కూడా జరిగింది. 2023, జనవరి 26న తిరుమలలో వివాహం జరిపేందుకు ముహూర్తం ఖరారు చేశారు. ఇరువైపు కుటుంబాలు శుభలేఖల పంపిణీ కార్యక్రమంలో మునిగితేలాయి.
ఈ నేపథ్యంలో ముంబయ్‌లో వుంటున్న ధర్మారెడ్డి కుమారుడు ఈ నెల 18న చెన్నైకి వెళ్లాడు. పెళ్లి కుమార్తెతో కలిసి తమ శుభలేఖల పంపిణీకి వెళుతున్న క్రమంలో చంద్రమౌళి గుండె పోటుకు గురయ్యాడు. పెళ్లి కుమార్తెతో పాటు చంద్రమౌళి స్నేహితుడు కలిసి అతన్ని కావేరి ఆస్పత్రికి తీసుకెళ్లారు. రెండు రోజులుగా యువకుడి ప్రాణాల్ని కాపాడేందుకు కావేరి ఆస్పత్రి వైద్యులు ప్రయత్నించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది.
ఇవాళ అతను తుది శ్వాస విడిచినట్టు వైద్యులు ప్రకటించారు. ఉజ్వల భవిష్యత్ ఉన్న కొడుకు మృతితో ధర్మారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ధర్మారెడ్డి కుమారుడి మృతికి సీఎం జగన్, వైసీపీ నేతలు సంతాపం ప్రకటించారు.