విశాఖ ఉక్కు మీద వేటు వేసి కాటు వేయడానికి సిద్ధంగా ఉన్నది బీజేపీ నాయకత్వాన కేంద్ర ప్రభుత్వం. ఈ విషయం అందరికీ తెలుసు. ఇక బలమైన ఏపీ ప్రభుత్వం కానీ దేశంలోని విపక్షాలు కానీ ఆరు వందల రోజులు పైదాటిన ప్రజా ఉద్యమాలు కానీ బీజేపీ వేటుని, స్టీల్ ప్లాంట్ వేటను ఎలా చూసినా కూడా ఆపలేకపోతున్నాయి.
మరి అదే పార్టీకి చెందిన ఒక ఎంపీ గారు ఉక్కు పరిరక్షకుడిగా ఈ వేటుకు అడ్డు నిలబడతారా. ఇది జరిగే పనేనా. పోనీ ఆ ఎంపీ గారు ఏమైనా ప్రజల ఓట్లతో గెలిచారా అంటే కానే కాదు. ఆయన బీజేపీ నామినేట్ చేస్తే యూపీ తరఫున రాజ్యసభ మెంబర్ గా పెద్దల సభలో కూర్చుంటున్నారు. ఆయెన జీవీఎల్ నరసింహారావు. ప్రకాశం జిల్లాకు చెందిన జీవీఎల్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి విశాఖను ఎంచుకున్నారు అని చెబుతారు.
ఇక ఈ ఎంపీ గారు తాజాగా విశాఖ ఉక్కు విషయంలో కేంద్ర మంత్రికి వినతులు ఇచ్చారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి మూలధనం సమకూర్చాలని, డైరెక్టర్ ఫైనాన్స్ పదవిని భర్తీ చేయాలని, నిర్వాసితులకు న్యాయం చేయాలని,ఉక్కు కార్మికులకు వేతనాలు పెంచాలని కోరుతూ ఆయన కేంద్ర పెద్దలను కలిశారు. అక్కడ వారు ఏమంటారో తరువాత విషయం కానీ ఈ మాత్రానికే ఉక్కు పరిరక్షకుడిగా ఆయన్ని భావించి బీజేపీ నాయకులు ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
అందరి ఆమోదం లేకుండా విశాఖ ఉక్కు కర్మాగారం విషయంలో ఎటువంటి తొందరపాటు నిర్ణయం వుండదని జీవీఎల్ కి కేంద్ర పెద్దలు హామీ ఇచ్చారని చెబుతున్నారు. ఉక్కు పరిరక్షణకు గతంలో అంటే 1998లో అప్పటి ప్రదాని వాజ్ పేయి 1333 కోట్లు ఇచ్చి ఆదుకున్నారని, ఇప్పుడు రాజ్యసభ ఎంపి జీవీఎల్ నరసింహారావు సహకారంతో ఉక్కు కర్మాగారం అన్ని విధాలుగా అబివృద్ది చెందుతుందని బీజేపీ నాయకులు చెబుతున్నారు.
ఎవరి మాట వినని కేంద్ర పెద్దలు తమ పార్టీకి చెందిన జీవీఎల్ మాట వింటే మంచిదే. విశాఖ ఉక్కు కొంప ముంచకుండా వేటు ప్రక్రియను ఆపితే మరీ మంచిదే. ఒకవేళ అలాంటి హామీని నేరుగా కేంద్రం నుంచి ప్రకటన రూపంలో జీవీఎల్ సాధిస్తే అపుడు పాలాభిషేకాలే కాదు, పూలాభిషేకాలు కూడా చేయవచ్చు. కానీ జస్ట్ వినతిపత్రం ఇచ్చినందుకే ఇలా చేస్తే ఓవర్ యాక్షన్ అని ఉద్యమకారులే కాదు జనసామాన్యం అనుకోదా.