కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడంపై కొన్ని వర్గాలు భగ్గుమన్నాయి. అమలాపురంలో మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్‌కుమార్ ఇళ్లను తగులబెట్టే దుశ్చర్యకు దిగడం ఆశ్యర్యం, ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ దుర్ఘటనల వెనుక అసలు సూత్రధారులెవరో రాష్ట్ర రోడ్డు, భవనాలశాఖ మంత్రి దాడిశెట్టి రాజా తనదైన రీతిలో చెప్పి, తీవ్రస్థాయిలో విమర్శించారు.
వ్యవస్థ మీద, ప్రజాస్వామ్య్ం మీద ఏ మాత్రం గౌరవం లేని వారే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతారని దాడిశెట్టి రాజా అన్నారు. అలాంటి ఏకైక వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే అని రాజా చెప్పుకొచ్చారు. కేరళతో పోటీ పడే అందాలు కోనసీమ సొంతమన్నారు. అలాంటి చోట కులాల మధ్య నిప్పు పెట్టడం చంద్రబాబుకే చెల్లిందన్నారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలని టీడీపీ, జనసేన డిమాండ్ చేయలేదా? అని మంత్రి దాడిశెట్టి రాజా ప్రశ్నించారు.
కుట్రలు పన్నడం చంద్రబాబుకు అలవాటే అన్నారు. ఉమ్మడి ఏపీతో పాటు ప్రస్తుతం మన రాష్ట్రానికి విలన్ చంద్రబాబే అన్నారు. పక్కా ప్లాన్ ప్రకారమే పచ్చని కోనసీమలో చంద్రబాబు, పవన్ అలజడి సృష్టించారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కోనసీమ విధ్వంసంపై సమగ్ర దర్యాప్తు జరిపి, నిందితులెవరైనా వదిలే ప్రశ్నే లేదని ఆయన హెచ్చరించారు.
ఆనాడు తుని ఘటనకు చంద్రబాబే కారణమన్నారు. తాజాగా తునిలాంటిదే అమలాపురం ఘటన అని అన్నారు. దీని వెనుక చంద్రబాబు ఉన్నారన్నారు. రాష్ట్ర ప్రజలతో చంద్రబాబు ఇష్టం వచ్చినట్టు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు తప్పుల్ని కప్పి పెట్టడానికి ఎల్లో మీడియా వుందన్నా పబ్లిక్‌గా ఒక మాట, వెనుక నుంచి మరోలా చేయడం జనసేన, టీడీపీలకే చెల్లిందన్నారు.