ఆయన నిత్యం కథాచర్చల్లోను, షూటింగుల్లోను మహబిజీగా ఉంటారు. సమయాన్ని కోట్ల రూపాయలతో తూకం వేస్తుంటారు. ఖాళీ దొరకడం చాలా కష్టం. షూటింగులో ఉంటూ.. మధ్యలో షాట్ గ్యాప్ వస్తే తప్ప పార్టీ నాయకులతో రాజకీయ విషయాలను చర్చించే ఖాళీ ఉండదు.
షూటింగులకు హాలిడే వస్తే తప్ప.. ప్రజల వద్దకు వెళ్లి వారి కష్టసుఖాలు వినడానికి కూడా ఖాళీ ఉండదు. అలాంటి హాలిడే పాలిటిక్స్ నడిపే నాయకుడికి.. మరో సంగతి ఎలా తెలుస్తుంది. అందుకే ఆయన లేని క్రాప్ హాలిడే సమస్యను తెరపైకి తెస్తున్నారు. లేని సమస్యను చెప్పడం మాత్రమే కాదు.. ఈ ప్రభుత్వానికి హాలిడే ఇచ్చేయాలని ప్రపంచానికి సందేశం కూడా ఇస్తున్నారు. జనసేన పార్టీ నడిపిస్తున్న ఈ హాలిడే పాలిటిక్స్ జనానికి చీదర పుట్టిస్తున్నాయి.
తమ పార్టీ కార్యకర్త ఒకరు మరణిస్తే ఇన్సూరెన్సు చెక్కు ఇవ్వడానికి వెళ్లిన నాదెండ్ల మనోహర్.. పనిలో పనిగా ప్రభుత్వం మీద ఎడాపెడా విమర్శలు కూడా చేశారు. వారాహి గురించి సర్కారు చేస్తున్న విమర్శలకు జవాబివ్వలేక.. దాని సంగతి సరే, ముందు తుపానుకు దెబ్బతిన్న రైతుల సంగతి చూడండి అంటూ ప్రభుత్వానికి చెప్పే ప్రయత్నం చేశారు. మధ్య గ్యాప్ లో ఆక్వారైతుల గురించి ఆయన ప్రేమాభిమానాలు ఒలకబోశారు.
ఆక్వా రంగం అనేది.. ఆర్థికంగా ఉపయోగపడగల రంగం. ఈ రంగాన్ని మచ్చిక చేసుకుంటే ఎన్నికల సమయానికి పార్టీకి ఫండింగ్ దండుకోవచ్చు అనేది కొందరి వ్యూహంగా ఉంటుంది. చంద్రబాబునాయుడు ముందడుగు వేసి.. ఆక్వా రంగానికి రూపాయిన్నరకే యూనిట్ విద్యత్తు ఇస్తానని ప్రకటించి.. ఆ రంగంలో పట్టు సంపాదించారు. ఇప్పుడు నాదెండ్ల మనోహర్ కూడా ఆక్వా పరిశ్రమలో ఉన్న వారిమీద ప్రేమాభిమానాలు ఒలకబోస్తున్నారు. ఈ రంగంపై ప్రభుత్వం నిర్దిష్టంగా పన్నులు వసూలు చేస్తున్నది. అదే తప్పు అన్నట్టుగా.. ఆక్వా పారిశ్రామికవేత్తలు ఏకంగా క్రాప్ హాలిడే పరిస్థితికి చేరుకుంటున్నారని నాదెండ్ల మొసలి కన్నీరు కారుస్తున్నారు.
నిజానికి క్రాప్ హాలిడే అనే తరహా పరిస్థితి ఆక్వా రంగంలో సుదూర భవిష్యత్తులో కూడా లేదు. ప్రభుత్వం నియమనిబంధనలను పద్ధతిగా అమలు చేస్తుండడం వలన.. ఇబ్బడిముబ్బడిగా పొందే లాభాలనుంచి కొంత కోల్పోతున్నారంతే. అయితే.. వారి మీద సానుభూతి చూపిస్తూ.. ఏకంగా క్రాప్ హాలిడే డైలాగులు వేస్తున్న నాదెండ్ల మనోహర్.. ఈ ప్రభుత్వానికి కూడా హాలిడే ఇవ్వాలంటూ పిలుపు ఇవ్వడమే తమాషా.
షూటింగుకు హాలిడే ఉంటే తప్ప.. ప్రజల వద్దకు రావడానికి కూడా ఖాళీ ఉండని టైంపాస్ రాజకీయ నాయకులకు ఇలా.. ప్రభుత్వానికి హాలిడే ఇవ్వాలనే కోరిక తప్ప ఇంకేం వస్తాయి. ప్రజల ఖర్మగాలి పవన్ ను ఏకంగా ముఖ్యమంత్రిని చేసేస్తేకూడా.. ఆయన షూటింగులకు హాలిడే ఉన్నప్పుడు మాత్రమే సెక్రటేరియేట్ కు వచ్చి పాలన సాగిస్తారని, షాట్ గ్యాప్ లో మాత్రమే చీఫ్ సెక్రటరీకి రోజువారి అపాయింట్మెంట్ ఇస్తారని జనం జోకులేసుకుంటున్నారు.