కమలంతో పవన్ కటీఫ్ కు ఇది సంకేతమే!

జనసేనాని పవన్ కల్యాణ్ కు తెలుగుదేశం పార్టీకి భజన చేయడం ఒక్కటే ప్రయారిటీ. చంద్రబాబునాయుడు పల్లకీ మోయడం ఒక్కటే ప్రయారిటీ. అందుకోసం ఆయన.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదు అని ఒక మాయమాటలు మాట్లాడుతుంటారు. …

జనసేనాని పవన్ కల్యాణ్ కు తెలుగుదేశం పార్టీకి భజన చేయడం ఒక్కటే ప్రయారిటీ. చంద్రబాబునాయుడు పల్లకీ మోయడం ఒక్కటే ప్రయారిటీ. అందుకోసం ఆయన.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదు అని ఒక మాయమాటలు మాట్లాడుతుంటారు. 

మోడీ రాష్ట్రానికి వస్తే తప్ప, ఆయన స్థానిక బిజెపి నాయకులతో రాజకీయ వ్యూహం గురించి, ఎలా ముందడుగు వేయాలనే సంగతి గురించి మాటమాత్రంగా కూడా చర్చించరు. అయితే.. చంద్రబాబుతో స్నేహానికి కమలం విముఖంగా ఉన్న నేపథ్యంలో.. వారితో బంధాన్ని తెంచుకుని అయినా.. చంద్రబాబు పల్లకీ మోసి తీరాల్సిందే అని పవన్ కల్యాణ్ ఫిక్సయినట్లుగా తెలుస్తోంది. కమలదళంలోనూ ఇటీవలే తిరుగుబాటు బావుటా ఎగరేసిన, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ అద్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో జనసేన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సారథి నాదెండ్ల మనోహర్ భేటీ కావడం ఇలాంటి అభిప్రాయాన్నే ప్రజలకు కలిగిస్తోంది. 

తాజాగా నాదెండ్ల, కన్నా లక్ష్మీనారాయణ భేటీ అయ్యారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం కలసి పనిచేస్తాం అని వారు ప్రకటించారు. కలసి పనిచేయాల్సిన అవసరం గురించి మాత్రం చర్చించామని, మిగిలిన అంశాలు పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ తో చర్చిస్తారని పార్టీ తమ ప్రకటనలో తెలియజేసింది. అంటే.. చాలా స్పష్టంగా.. ప్రపోజల్ మాత్రమే నాదెండ్ల వైపునుంచి కన్నాకు వెళ్లింది. ఆ డీల్, బేరం ఫైనలైజ్ చేసే వ్యవహారం పవన్ కల్యాణ్ చేతుల్లో మాత్రమే ఉన్నదన్నమాట. ఆయన బేరం ఫైనలైజ్ చేస్తారని వారే సంకేతం ఇస్తున్నారు.

బిజెపితో బంధం తెంచుకుంటే.. ఆ పార్టీలోని కొందరు నాయకుల్ని తమ జట్టులో కలిపేసుకోవడానికి పవన్ కల్యాణ్ ఉత్సాహపడతారనడంలో సందేహం లేదు. ఎందుకంటే.. బిజెపితో తెంచుకునే తన నిర్ణయాన్ని సమర్థించుకోవడానికి అలాంటి ఎత్తుగడ అవసరం. 

ప్రస్తుతానికి బిజెపిలో ఉంటూ.. పార్టీ మీదే విమర్శలు చేస్తూ లూప్ లైన్లో మనుగడ సాగిస్తున్న వారిలో కన్నా లక్ష్మీనారాయణ ముఖ్యులు. అక్కడే ఆయనకు జరుగుబాటు లేదు గనుక.. చిటికేస్తే వచ్చేస్తారు. ఎటూ కులం దన్నుకూడా జనసేనలో పుష్కలంగా ఉంటుంది. స్థానిక రాజకీయాల దృష్ట్యా.. తెలుగుదేశంలోకి వెళ్లడం కన్నాకు సాధ్యం కాదు. జనసేన అయితే అన్ని రకాలుగా కలిసొస్తుంది. ఈ నేపథ్యంలో కన్నాను జనసేనలో చేర్చుకోవడానికి , నాదెండ్ల భేటీ రూపంలో బేరసారాలు మొదలయ్యాయి. 

బిజెపి అగ్ర నాయకుడిని.. ఆ పార్టీనుంచి తమలోకి చేర్చేసుకోవడం అంటే.. పవన్ కల్యాణ్ కమలం హైకమాండ్ కు చాలా స్పష్టమైన హెచ్చరిక చేసినట్టే. నేను చెప్పినట్టు వినకపోతే.. మీరు కూడా నాతో కలిసి చంద్రబాబునాయుడు పల్లకీ మోయకపోతే.. మీ పార్టీని ఖాళీ చేస్తా అని పవన్ కల్యాణ్ బెదిరిస్తున్నట్టే అని ప్రజలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఇరు పార్టీల మధ్య బంధం తెగెతెంపులు అయ్యే రోజు ఎంతో దూరంలో లేదని కూడా అంటున్నారు.