మెరుగైన విద్యను బోధించే క్రమంలో దేశంలోనే కొత్త సంచలనాలు నమోదుచేస్తున్న సంస్థ బైజూస్.. తమకు రోజురోజుకు మరింత భారంగా మారుతున్న తెల్లఏనుగును వదిలించుకోవడానికి ప్రయత్నిస్తోంది. తెలిసో తెలియకో.. అత్యుత్సాహంతోనో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు జెర్సీని స్పాన్సర్ చేయడానికి డీల్ కుదుర్చుకున్న బైజూస్ ఇక ఈ డీల్ నుంచి తప్పుకోవాలనే తమ ఉద్దేశాన్ని ఆల్రెడీ బీసీసీఐ వర్గాలకు తెలియజేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. బైజూస్ సంస్థకు తలకుమించిన భారంగా మారినందునే ఈ డీల్ నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది.
వచ్చే ఏడాది మార్చి వరకు క్రికెట్ జెర్సీ స్పాన్సర్ షిప్ ను కొనసాగించాలని బైజూస్ నిర్ణయించింది. మీడియా ప్రచారంపై పెట్టే ఖర్చులను క్రమబద్ధీకరించుకోవడంలో భాగంగా.. ఆ తర్వాత దీనిని వదిలించుకోవాలని చూస్తోంది. బైజూస్ అనేది దేశంలోనే అతిపెద్ద విద్యావ్యాపార సంస్థగా ఆవిర్భవించింది. మరో అతిపెద్ద సంస్థ ఆకాష్ ను కూడా కొనుగోలు చేయడం ద్వారా.. తమ విస్తృతిని పెంచుకుంది.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కూడా ఒప్పందం కుదుర్చుకుని.. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు విద్యాసాంకేతిక సహకారాన్ని అందిస్తోంది. ఇలా అన్ని రకాలుగా విస్తరిస్తున్న బైజూస్ సంస్థ.. తమ ప్రచార ఆర్భాటాల మీద కూడా బాగానే ఖర్చుపెడుతుంటుంది. అయితే.. వారు ప్రచారం కోసం పెట్టే ఖర్చులో క్రికెట్ జెర్సీ స్పాన్సర్ షిప్ అనేది తెల్లఏనుగులా తయారైందని సమాచారం. క్రికెట్ క్రీడా ప్రసారాలు పెద్దపెద్ద పెయిడ్ చానెల్స్ కుమాత్రమే దక్కుతున్న నేపథ్యంలో లైవ్ క్రికెట్ ను వీక్షించే వారి సంఖ్య కూడా తగ్గుతోంది.
మరోవైపు బైజూస్ తమ ప్రచారం కోసం పెడుతున్న ఖర్చు గత ఆర్థిక సంవత్సరంలో 899 కోట్ల నుంచి 2251 కోట్లకు పెరిగిందిట. అదే సమయంలో నష్టాలుకూడా పలకరిస్తున్నాయి. బీసీసీఐ మాత్రమే కాకుండా, ఐసీసీ కార్యక్రమాలకు కూడా వీరు స్పాన్సర్లుగా ఉన్నారు. ఫిఫా వరల్డ్ కప్ స్పాన్సరుగా కూడా ఉన్నారు.
బీసీసీఐ జెర్సీ స్పాన్సర్ షిప్ డీల్ 2022 మార్చిలో ముగియగా.. జూన్ లో వారు దానిని తిరిగి పునరుద్ధరించుకున్నారు. అందుకు గాను.. 2023 వరకు 55 మిలియన్ డాలర్లతో డీల్ కుదుర్చుకున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఫిఫా వరల్డ్ కప్ ఫుట్ బాల్ స్పాన్సర్షిప్ కోసం 30-40 మిలియన్ డాలర్లను వెచ్చించినట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఇలాంటి నేపథ్యంలో ఏడాదికి ఇంచుమించు 454 కోట్ల రూపాయల ఖర్చుతో బీసీసీఐ క్రికెట్ జెర్సీ స్పాన్సర్షిప్ వృథా అనే అభిప్రాయానికి బైజూస్ వచ్చినట్టుగా సమాచారం. అందుకే ఈ ఒప్పందం నుంచి వైదొలగనున్నట్టుగా ఆల్రెడీ బీసీసీఐకు తెలియజేసింది.
జెర్సీ స్పాన్సరింగ్ అనేది నిజానికి బీసీసీఐకు భారంగానే మారుతోంది. గతంలో సహారా సంస్థ ఉండేది. వారు తప్పుకున్న తర్వాత ఎన్నిసార్లు బిడ్లు పిలిచినా ఎవరూ ముందుకు రాలేదు. చివరికి బైజూస్ తో కుదిరింది. వీరు కూడా తప్పుకుంటే ఇక కొత్త స్పాన్సర్ ఎవరు అవుతారో చూడాలి.