మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి కేసుకు సంబంధించిన ఫైల్ కోర్టులో చోరీకి గురైంది. కుక్కలు తరిమితే ఇనుము కోసం వచ్చిన దొంగలు ఆ ఫైల్ వున్న సంచి ఎత్తుకుపోయారని, కాగితాలు మురిక్కాలువలో వేశారని పోలీసులు చెబుతున్నారు. సహజంగానే పోలీసుల్ని మనం నమ్మం. చంద్రబాబు నుంచి చిన్న నాయకుడు వరకూ మంత్రిని వేలెత్తి చూపుతున్నారు.
మొత్తం కేసుని లాజికల్‌గా ఆలోచిస్తే బాధ్యత కలిగిన మంత్రి పదవి వచ్చినపుడు ఎవరైనా తెలివి తక్కువగా కోర్టులో దొంగతనం చేయిస్తారా? ఇది జరిగిన మరుక్షణమే అందరూ తననే అనుమానిస్తారని తెలియనంత అమాయకుడా కాకాణి?
అంత సాహసం చేయడానికి అదేం మరణశిక్ష పడేంత కేసా? పదవి వూడిపోయేంత కేసా? ఓటుకు నోటు కేసులో చంద్రబాబే నిమ్మళంగా ఉన్నపుడు ఈ ఫోర్జరీ కేసు తేలేదెప్పుడు? ఒకవేళ కింది కోర్టులో శిక్ష పడిందనుకుంటే అపీల్ చేసుకోడానికి పైకోర్టులు వున్నాయి కదా? వ్యతిరేకంగా తీర్పు వస్తే రాజీనామా చేయడానికి ఇదేం నీలం సంజీవరెడ్డి కాలం కాదు.
ఒకవేళ కాకాణి నిజంగానే చోరీ చేయించాడని అనుకుందాం. ఆ కేసుకి సంబంధించిన సాక్ష్యాల కాపీలు సోమిరెడ్డితో ఇంకో సెట్ వుంటాయి కదా? వాటిని మళ్లీ సబ్‌మిట్ చేయలేనంత అమాయకుడా సోమిరెడ్డి.
కాకాణిని అప్రతిష్టపాలు చేయడానికి ఇది కుట్ర ఎందుకు కాకూడదు. ఎందుకంటే కథ ఇంత దూరం వచ్చి చర్చలు, డిబేట్లు జరిగిన తర్వాత పోలీసులు నిజంగానే ఎంక్వయిరీ చేసి ఇదే వాస్తవం అని చెప్పినా ఎవరూ నమ్మని స్థితి. వ్యవస్థలపైన నమ్మకం పోవడం వల్ల జరుగుతున్న అనర్థం ఇది.
జీఆర్ మహర్షి