వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో ప్రారంభమైన మేమంతా సిద్ధం బస్సుయాత్రకు రోజురోజుకూ ప్రజాదరణ పెరుగుతోంది. వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గత నెలాఖరులో మేమంతా సిద్ధం బస్సుయాత్రను ప్రారంభించారు. ఇవాళ్టికి ఆ యాత్ర 17వ రోజుకు చేరింది. గ్రేటర్ రాయలసీమ వరకూ జగన్ బస్సుయాత్రకు విశేష ప్రజాదరణ వుంటుందని కూటమి నేతలు ఊహించారు.
కానీ అనూహ్యంగా కోస్తాలో జగన్ యాత్రకు కనీవినీ ఎరుగని రీతిలో మద్దతు వెల్లువెత్తుతోంది. ప్రకాశం జిల్లాలో యాత్ర పూర్తి చేసుకున్న జగన్… విజయవాడలో అడుగు పెట్టగానే, వెల్లువెత్తిన ఆ జన సమూహం మరోసారి ప్రతిపక్ష నాయకుడిగా చేసిన పాదయాత్రను గుర్తు చేసింది. జగన్ కనిపించగానే జనంలో మాటల్లో చెప్పలేని ఉద్వేగం, ఉత్సాహం కనిపిస్తున్నాయి. నిజానికి ఇంత ప్రజాదరణ వైసీపీ కూడా ఊహించలేదు.
ప్రస్తుతం జగన్ బస్సుయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో పూర్తి చేసుకుని , తూర్పుగోదావరి జిల్లాలో ప్రవేశించనుంది. ప్రధానంగా కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి, విశాఖ జిల్లాలపై కూటమి ఆశలు పెట్టుకున్న సంగతి తెలిసిందే. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో జనప్రవాహాన్ని కూటమి అంచనా వేయలేదు. ఆ తర్వాత ఉభయగోదావరి జిల్లాల్లో జగన్ బస్సుయాత్రను వెంబడిస్తున్న జనం నుంచి వస్తున్న స్పందన కూటమిని షాక్ గురి చేస్తోంది.
రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల వరకూ జగన్ యాత్రకు విశేష ఆదరణ దక్కిందని అర్థం చేసుకోవచ్చని, ఆ తర్వాత అంతకంటే ఎక్కువ జనం రావడం ఏంటనే అంతర్మథనం కూటమి నేతల్లో మొదలైంది. మేమంతా సిద్ధం యాత్రకు కోస్తాలో ఆదరణ కూటమి గుండెల్లో గుబులు రేపుతోంది. ఎందుకిలా అంటూ ఆయా ప్రాంతాల్లోని కూటమి నేతలు ఫోన్లలో ఆరా తీస్తున్నారని సమాచారం. ఇంకా జగన్‌పై మోజు తీరలేదా? జన స్పందన చూస్తే మళ్లీ ఆయనే అధికారంలోకి వచ్చేలా ఉన్నారే అని కూటమి నేతలు తమ సంభాషణల్లో భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
బస్సుయాత్రలో ప్రజాదరణ ప్రదర్శనలో తామేం తక్కువ అని నిరూపించుకోడానికి పోటీ పడుతున్నట్టుగా వుంది. మరీ ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాల్లో పవన్‌కల్యాణ్ వల్ల రాజకీయ ప్రయోజనం వుంటుందని ఆశించిన టీడీపీ నేతలు… జగన్ యాత్రకు వస్తున్న స్పందన చూసి, ఒక్కసారిగా నిరుత్సాహానికి గురి అవుతున్నారు. కూటమి కట్టడమే తమ కొంప ముంచుతోందనే భావన టీడీపీలో నెమ్మదిగా బలపడుతోంది.