ఏపీలో మూడు రాజధానులు వర్సెస్ అమరావతి రాజధాని అన్నట్లుగా రాజకీయ కధ సాగుతోంది. అమరావతి రైతుల పాదయాత్ర ఉత్తరాంధ్రా మీదుగా సాగి అరసవెల్లిలో ముగించాలని చూస్తున్నారు. దానికి ధీటుగా మూడు రాజధానుల మీద రౌండ్ టేబుల్ సమావేశాలను ప్రతీ కీలక ప్రాంతాలలో నిర్వహిస్తూ ప్రజాభిప్రాయన్ని కూడగట్టే ప్రయత్నం కూడా జరుగుతోంది.
దీనితో పాటుగా విజయాలు అందించే విజయదశమి వేళ ఆధ్యాత్మికత సెంటిమెంట్ ని జోడిస్తూ వికేంద్రీకరణకు మద్దతుగా దుర్గామాత ఆలయాల్లో పెద్ద ఎత్తున పూజలు చేయాలని వైసీపీ నేతలు పిలుపు ఇస్తున్నారు. ఉత్తరాంధ్రా జిల్లాల వైసీపీ అధ్యక్షులు తమ పార్టీ శ్రేణులంతా దసరా రోజున గుళ్ళకు వెళ్ళి మరీ ప్రత్యేక ప్రార్ధనలు చేస్తారని వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాలు సుఖంగా ఉండాలని కోరుతారని చెబుతున్నారు.
విశాఖ రాజధానిగా ఉండాలని కోరుతూ టీడీపీ నుంచి గెలిచి వైసీపీలోకి వచ్చిన వాసుపల్లి గణేష్ కుమార్ నాయకత్వంలో విశాఖలో దుర్గాదేవి ఆలయం ఎదుట 101 కొబ్బరి కాయలు కొట్టి మొక్కుకున్నారు. విశాఖ రాజధానికే 2014లో ఎక్కువ మంది మద్దతు ఇచ్చినా చంద్రబాబు దాన్ని కాదని అమరావతి రాజధాని అంటూ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని వాసుపల్లి విమర్శించారు.
శ్రీకాకుళం పాతపట్నంలో ఎమ్మెల్యే రెడ్డి శాంతి సైతం నూటొక్క కొబ్బరికాయలతో దుర్గామాతకు ప్రత్యేక పూజలు చేశారు. వికేంద్రీకరణతోనే అందరికీ అభివృద్ధి ఫలాలు అందుతాయని శ్రీకాకుళం వైసీపీ జిల్లా ప్రెసిడెంట్ ధర్మాన క్రిష్ణదాస్ చెప్పుకొచ్చారు. ఈ విషయంలో తాము ప్రజల మాటనే వింటామని, విపక్షాలు కూడా వెనకబడిన ప్రాంతాల మొర ఆలకించాలని ఆయన కోరుతున్నారు.
శివరామక్రిష్ణ కమిటీ నివేదిక ప్రకారమే మూడు రాజధానుల అంశాన్ని తమ ప్రభుత్వం తలపెట్టిందని రెవిన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెబుతున్నారు. ఈసారి విజయదశమి మాత్రం వికేంద్రీకరణ మంత్రంతో మారుమోగుతోంది.