భారతీయుల వ్యయాల గురించి కేంద్ర ప్రభుత్వ సర్వేలో కొన్ని ఆసక్తిదాయకమైన విషయాలను పేర్కొన్నారు. ఇందులో హైలెట్ ఏమిటంటే.. ఇండియన్స్ భోజన అలవాట్లు నాన్ వెజ్ వైపు పరుగులు తీస్తున్నాయి. ఈ విషయం కొత్తగా చెప్పాల్సిందేమీ కాదు. ఈ దేశంలో గత ఇరవైయేళ్లలో మారిన ఆహారపు అలవాట్లు ఏమిటో ఎవరికి వారు తమ ధోరణిని పరిశీలించుకుంటే అర్థం అవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మాంసాహారం విషయంలో ఇండియన్స్ విజృంభిస్తూ ఉన్నారు.
ఇదే అంశాన్ని కేంద్ర ప్రభుత్వ అధ్యయనం మరో రకంగా చెప్పింది. భారతీయులు పాల కోసం, గుడ్ల కోసం పెట్టే ఖర్చుతో పోలిస్తే.. కాయగూరల కోసం పెడుతున్న ఖర్చు తక్కువగా ఉందట! ఒక నెల లెక్క తీసుకుంటే.. పాలు ప్లస్ గుడ్ల కోసం పెట్టే ఖర్చును లెక్క పెట్టి, అదే నెల వ్యవధిలో కాయగూరల కోసం పెట్టే ఖర్చుతో దాన్ని పోలిస్తే కాయగూరల కన్నా పాల, గుడ్ల ఖర్చే ఎక్కువగా ఉంటోందట! మరి తాము పూర్తి శాఖా హారులం అనే వారిని పక్కన పెడితే.. దక్షిణాది రాష్ట్రాల్లో అయితే వీరి శాతం మరింత తక్కువ కాబట్టి.. వారిని పక్కన పెడితే, నాన్ వెజ్ కొనుగోలుకు పెట్టే ఖర్చు కన్నా కాయగూరల ఖర్చు తక్కువే అనడంలో పెద్ద వింత లేదు. కేంద్ర ప్రభుత్వం మధ్యలో పాలను తీసుకొచ్చింది. కానీ.. ప్రస్తుతం కిలో మటన్ రేటు ఎనిమిది వందల రూపాయల వరకూ ఉంది సిటీల్లో. పల్లెలూ, ఓ మోస్తరు టౌన్లలో కూడా కాస్త అటు ఇటుగా అదే ధరే ఉంది. మహా అంటే ఒక యాభై రూపాయలు తేడా!
నెలలు నాలుగుకిలోల మటన్ ను ఒక కుటుంబం తింటుందనుకున్నా.. 2,400 రూపాయలు. కాయగూరల ధరలు కూడా గట్టిగానే ఉన్నా.. నెలకు అలాంటి కుటుంబం అంత మొత్తాన్ని వాటి కోసం వెచ్చిస్తుందా అనేది కాస్త సందేహమే! కేవలం ఆదివారాలు నాన్ వెజ్ తినడమే కాదు, ఇంటి బయట నాన్ వెజ్ రుచుల కోసం ఎగబడుతూ ఉన్నారు సిటీ జనాలు, దీనికి పట్టణ ప్రజలు కూడా మినహాయింపు కాదు! మరి అలా బయట కూడా తినే నాన్ వెజ్ కోసం వెచ్చించే మొత్తం మరింతగా ఉంటుంది. మటన్ ఖరీదు కాబట్టి.. చికెన్ వైపు మొగ్గు చూపే వాళ్ల ఖర్చు కూడా తక్కువేమీ కాదు. చికెన్ ధర కిలోకు తక్కువ అంటే రెండు వందలు, గరిష్టంగా నాలుగు వందల వరకూ బ్రాయిలర్ చికెన్ ధర పలుకుతూ ఉంటుంది. అదే నాటు చికెన్ కావాలంటే.. ఒరిజినల్ నాటీ చికెన్ ధర మటన్ ను దాటింది. ఇలా ఎలా చూసినా.. కులాల రీత్యా శాఖాహరం వైపు కాకుండా, నాన్ వెజ్ తినే కుటుంబం ఒక నెలకు ఇంటికి తెచ్చే మాంసం, బయట తినే మాంసాహారానికి పెట్టే ఖర్చు చూస్తే.. వారు కాయగూరల కోసం పెట్టే బడ్జెట్ ను మించిపోతుందనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు!
ఇక కేంద్ర ప్రభుత్వం చికెన్ మటన్ లెక్కలు వేయకుండా పాలను ప్రస్తావించింది. పాల ధర ఏమీ తక్కువ లేదు. నలుగురు కుటుంబ సభ్యులున్న ఒక కుటుంబం రోజుకు అరలీటరు పాలను కొంటుందనుకున్నా.. అరలీటరు పాల ధర కనిష్టంగా 27 రూపాయలు, గరిష్టంగా 40 రూపాయల వరకూ ఉన్నాయి బ్రాండ్లను, రకరాలను బట్టి. అంటే సగటున ముప్పై రూపాయల ధరతో లెక్కేసినా నెలకు పాల బిల్లు 1500 రూపాయల వరకూ ఉంటుంది. దీనికి గుడ్లను కలిపింది కేంద్రం చేసిన సర్వే. ఒక కుటుంబం నెలకు రెండు డజన్ల గుడ్లను కొనుగోలు చేసినా.. ఒక్కో గుడ్డు ఖరీదు ఇప్పుడు కనిష్టంగా ఐదు రూపాయలతో మొదలు పెడితే, గరిష్టంగా పది, పన్నెండు రూపాయలు కూడా అమ్ముతున్నారు! యావరేజ్ మీద ఆరు రూపాయలతో గణించినా మూడు వందల రూపాయల వరకూ నెలకు గుడ్ల కోసం వెచ్చించడంలో పెద్ద వింత లేదు. అంటే 1800 రూపాయల వరకూ పాలు, గుడ్లు బిల్లు అవుతుంది. సదరు కుటుంబం కాయగూరలు అయితే ఇంత డబ్బు పెట్టడం లేదనేది కేంద్రం తేల్చిన అంశం.
మీట్ వినియోగం దేశంలో ఎప్పటికప్పుడు పెరిగిపోతూనే ఉంది. భారతీయులు ఇలా తింటూ ప్రపంచ వ్యాప్తంగా ఫుడ్ డిమాండ్ ను పెంచేస్తున్నారంటూ అమెరికన్లు ఎప్పుడో దశాబ్దంన్నర కిందటే మొత్తుకున్నారు. అయితే ఇండియాలో నాన్ వెజ్ రుచులను కూడా అమెరికన్ కంపెనీలు వీలైనంతగా సొమ్ము చేసుకుంటున్నాయి. కేఎఫ్సీ, మెక్ డొనాల్డ్స్ తో మొదలుపెడితే.. ఈ వ్యాపారంలో కూడా వారు చాలా ముందున్నారు. ఇక అలాంటి చికెన్లే కాకుండా.. ఇండియాలో పౌల్ట్రీ ఇండస్ట్రీ డిమాండ్ మీద కొనసాగుతూ ఉంది. కోళ్లకు జబ్బులు వంటి సమస్యలను పక్కన పెడితే.. పౌల్ట్రీ ఇండస్ట్రీ ఇప్పుడు భారీ ఎత్తున సాగుతూ ఉంది. పల్లెల్లో నాటు కోళ్లను పెంచుకున్నా.. చేతికి డబ్బులు అందే పరిస్థితి ఉందిప్పుడు. ఫీడింగ్ చికెన్ తో పోలిస్తే సహజంగా పెరిగిన కోళ్లు, గొర్లకు డిమాండ్ పెరుగుతోంది. ఫీడింగ్ చికెన్ వల్ల ఆరోగ్య సమస్యలు ఉంటాయనే ప్రచారం వల్ల కంట్రీ చికెన్ కు డిమాడ్ పెరిగింది. అది అంత తేలికగా దొరకడం కూడా లేదు!
ఏతావాతా.. నాన్ వెజ్ రుచుల కోసం భారతీయుల వెంపర్లాట పతాక స్థాయిలో కొనసాగుతూ ఉంది. వీగన్ కాన్సెప్టులతో పోలిస్తే.. నాన్ వెజ్ తో పోషకాలు అనే ప్రచారానికే భారతీయులు ప్రాధాన్యతను ఇస్తూ వీలైనంతగా చికెన్, మటన్ లను లాగిస్తున్నారు. పెరిగిన ఆర్థిక శక్తి కూడా దీనికి ఊతం ఇస్తూ ఉందనడంలో ఆశ్చర్యం లేదు.
ప్లే బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది
Nijame