స‌త్యం ప‌లక‌య్యా సామి అంటే…!

అనంత‌పురం జిల్లాకు వెళ్లిన మంత్రి స‌త్య‌కుమార్‌… ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో కూట‌మిలో విభేదాలు లేనేలేవ‌ని చిలుక ప‌లుకులు ప‌ల‌క‌డం గ‌మ‌నార్హం.

ఆయ‌న పేరు స‌త్య‌కుమార్‌. ఏపీ వైద్యారోగ్య‌శాఖ మంత్రి. సార్థ‌క నామ‌ధ్యేయుడు అనిపించుకోవాలంటే స‌త్యాన్నే ప‌ల‌కాల‌ని సూచించినా, ఆయ‌న మాత్రం అందుకు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని నెటిజ‌న్లు విమ‌ర్శిస్తున్నారు. ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లా ధ‌ర్మ‌వ‌రం నుంచి స‌త్య‌కుమార్ బీజేపీ త‌ర‌పున ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. చంద్ర‌బాబు కేబినెట్‌లో చోటు ద‌క్కించుకున్నారు. ఇంత వ‌ర‌కూ బాగానే వుంది.

ధ‌ర్మ‌వ‌రంలో తాను చెప్పిందే శాస‌నం అని ఆయ‌న అనుకున్నారు. అయితే నీ ప‌ప్పులేమీ ఉడ‌క‌వ‌ని అధికారంలోకి వ‌చ్చిన కొత్త‌లోనే టీడీపీ ధ‌ర్మ‌వ‌రం ఇన్‌చార్జ్ ప‌రిటాల శ్రీ‌రామ్ తేల్చి చెప్పారు. ధ‌ర్మ‌వ‌రం మున్సిపాలిటీ క‌మిష‌న‌ర్‌గా ఏరికోరి ఒక అధికారిని నియ‌మించారు. అయితే గ‌తంలో స‌ద‌రు అధికారి వైసీపీ ప్ర‌భుత్వంలో ప‌ని చేశార‌ని, టీడీపీ నాయ‌కుల్ని ఇబ్బంది పెట్టార‌ని, ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఆ అధికారిని ఒప్పుకునే ప్ర‌శ్నే లేద‌ని ప‌రిటాల శ్రీ‌రామ్ స్ప‌ష్టం చేశారు.

అంతేకాదు, క‌మిష‌న‌ర్ బాధ్య‌త‌లు చేప‌డితే, లాక్కుని వ‌స్తామ‌ని వార్నింగ్ ఇచ్చారు. ఈ నేప‌థ్యంలో మంత్రి స‌త్య‌కుమార్ ధ‌ర్మ‌వరానికి వెళ్లి అధికారుల‌తో నిర్వ‌హించిన స‌మీక్ష స‌మావేశానికి క‌మిష‌న‌ర్ వెళ్లార‌ని తెలిసి, టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున ఆందోళ‌న‌కు దిగిన సంగ‌తి తెలిసిందే. దీంతో ధ‌ర్మ‌వ‌రంలో కూట‌మి విభేదాలు రోడ్డుకెక్కాయ‌ని మీడియా కోడై కూసింది. వ్య‌వ‌హారం సీఎం చంద్ర‌బాబు వ‌ర‌కూ వెళ్లింది.

చివ‌రికి ప‌రిటాల శ్రీ‌రామ్ మాటే నెగ్గింది. ధ‌ర్మ‌వ‌రం క‌మిష‌న‌ర్‌ను మ‌రోచోటికి బ‌దిలీ చేశారు. ఇవాళ అనంత‌పురం జిల్లాకు వెళ్లిన మంత్రి స‌త్య‌కుమార్‌… ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో కూట‌మిలో విభేదాలు లేనేలేవ‌ని చిలుక ప‌లుకులు ప‌ల‌క‌డం గ‌మ‌నార్హం. స‌త్య‌కుమార్ ధ‌ర్మ‌వ‌రం రాజ‌కీయాల‌పై అస‌త్యాలు చెప్తున్నార‌ని కూట‌మి నేత‌లే గుస‌గుస‌లాడుకోవ‌డం విశేషం. కూట‌మి నేత‌ల మ‌ధ్య దూరం అనేది దుష్ప్ర‌చారం అని స‌త్య‌కుమార్ సెల‌విచ్చారు. నిప్పులేనిదే పొగ‌రాద‌ని జ‌నానికి తెలియ‌ద‌ని స‌త్య‌కుమార్ అనుకుంటున్నారా? అనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది.

2 Replies to “స‌త్యం ప‌లక‌య్యా సామి అంటే…!”

Comments are closed.