వారంలోగా ఆలయాల బోర్డులు.. జరిగే పనేనా?

రాష్ట్రంలోని ప్రఖ్యాత శివాలయం శ్రీశైలంలో ఈనెల 19 నుంచి శివరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.

నామినేటెడ్ పోస్టుల పందేరం విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మీనమేషాలు లెక్కిస్తూ ఉంటారని, ఒక పట్టాన ఏ సంగతి తేల్చరని ఆ పార్టీ కార్యకర్తలు అనుకుంటూ ఉంటారు. నాలుగోసారి ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా ఆయన తన అలసత్వ కీర్తిని పదిలంగా కాపాడుకుంటూనే ఉన్నారు.

ఫిబ్రవరి 26న మహాశివరాత్రి పర్వదినం జరగనుంది. రాష్ట్రంలో అనేక ప్రసిద్ధి చెందిన శివాలయాలు ఉన్నాయి. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క శివాలయానికి కూడా పాలకమండలిని ఏర్పాటు చేయలేదు! చంద్రబాబునాయుడు ప్రభుత్వం కొలువుతీరి దాదాపు 9 నెలలు కావస్తోంది. కార్యకర్తల, దిగువశ్రేణి నాయకుల కష్టంతో గెలిచిన వాళ్లు పదవులు అనుభవిస్తున్నారు. కానీ గెలిపించిన కార్యకర్తలకు, నాయకులకు నామినేటెడ్ పదవులు కూడా వీలైనంత త్వరగా ఇవ్వాలనే భావన పార్టీకి లేకుండాపోయిందనే అసంతృప్తి వారిలో వ్యక్తం అవుతోంది.

గెలిచినప్పటి నుంచి నామినేటెడ్ పోస్టుల విషయంపై చంద్రబాబునాయుడు రోజులు వెళ్లదీస్తున్నారు. ఇటీవల రాష్ట్రంలోని దాదాపు 1100 పైగా ఆలయాలకు త్వరలోనే పాలకమండళ్లు ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. చంద్రబాబు ప్రకటన విని పార్టీ శ్రేణులంతా మురిసిపోయారు. పదవుల పంపకం జరిగితే తమకు కూడా అవకాశం దక్కుతుందని జనసేన, బీజేపీ నాయకులు కూడా ఎదురు చూస్తున్నారు. అయితే, చంద్రబాబు మాత్రం ఇప్పటికీ నిర్ణయం తీసుకోవడం లేదు.

ఇటీవల దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శ్రీకాళహస్తీశ్వరాలయంలో శివరాత్రి ఏర్పాట్లను సమీక్షించడానికి వెళ్లినప్పుడు కూడా పార్టీ కార్యకర్తలను ఊరడించేలా మాట చెప్పారు. త్వరలోనే ఆలయాలకు పాలకమండళ్లు ఏర్పాటు జరుగుతాయని తెలిపారు. 1100 పైగా ఆలయాల్లో అన్నీ కాకపోయినప్పటికీ కనీసం శివాలయాలన్నింటికీ శివరాత్రి వరకు పాలకమండళ్లు ప్రకటిస్తారని ఆశించారు. అయితే ఇప్పటివరకు ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకున్నట్టు కనిపించడం లేదు.

రాష్ట్రంలోని ప్రఖ్యాత శివాలయం శ్రీశైలంలో ఈనెల 19 నుంచి శివరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. శ్రీకాళహస్తిలో 21 నుంచి శివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. కానీ ఆలయాల పాలకమండళ్లు మాత్రం ఇప్పటివరకు ఏర్పాటు కాలేదు. ఈ ఆలయాలకు అధ్యక్షులు అయ్యే వ్యక్తులు తమ పదవీకాలంలో శివరాత్రి ఉత్సవాల నిర్వహణను మహద్భాగ్యంగా భావిస్తారు. చంద్రబాబునాయుడు తన అలసత్వం వల్ల పార్టీ నాయకులకు అలాంటి అవకాశాన్ని కోల్పోయేలా చేస్తున్నారని అంతా అనుకుంటున్నారు.

2 Replies to “వారంలోగా ఆలయాల బోర్డులు.. జరిగే పనేనా?”

Comments are closed.