ఉత్తరాంధ్ర కోసం.. విశాఖలో రాజధాని కోసం.. త్యాగాలు చేస్తానని బీరాలు పలుకుతున్న మంత్రి ధర్మాన ప్రసాదరావు.. పదవిని త్యజించి రోడ్డు మీదకు వచ్చి పోరాటాలు చేస్తానంటున్న ధర్మాన ప్రసాదరావు.. ఇంతకూ ప్రభుత్వానికి పరువు నిలిపే మాటలే మాట్లాడుతున్నారా? లేక ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారా? అనేది అర్థం కావడం లేదు! తాను రోడ్డెక్కి పోరాటాలు చేస్తానని ప్రకటిస్తున్న ధర్మాన ప్రసాదరావు.. జగన్మోహన్ రెడ్డి సర్కారును కూడా రోడ్డున పడేసే విధంగా మాట్లాడుతున్నారనే అభిప్రాయం ఇప్పుడు పలువురిలో కలుగుతోంది. మూడు రాజధానుల విషయంలో న్యాయపరంగా చిక్కులు, విపక్షాల పోరాటాలు, చికాకు పెడుతున్నప్పటికీ కేవలం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడం అనేది ఒక్కటే లక్ష్యంగా తాము ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా ప్రభుత్వం డంకా బజాయించి చెబుతోంది.
ప్రతిపక్షాల వారెవరూ కూడా నోరెత్తలేని విధంగా ‘‘మూడు ప్రాంతాల అభివృద్ధి మూడు రాజధానులతో సాధ్యమవుతుందని’’ అధికార పార్టీ నాయకులు పదే పదే ప్రకటిస్తున్నారు. కానీ తాజాగా మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడిన మాటలు ఉత్తరాంధ్ర మినహా, మిగిలిన ప్రాంతాలకు చెందిన వారిని ఆందోళనకు గురి చేసే విధంగా ఉన్నాయి. నాన్ ఉత్తరాంధ్ర ప్రాంతాలకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఇబ్బంది పడేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి.
ఇంతకూ ధర్మాన ప్రసాదరావు ఏం అంటున్నారంటే..
‘‘మూడు రాజధానులు అంటే ఏంటి.. మూడు రాజధానులు ఎక్కడైనా ఉంటాయా.. మూడు రాజధానులు లాంటివేం లేవు.. విశాఖపట్నం ఒక్కటే రాజధాని.. పరిపాలన మొత్తం విశాఖపట్నం నుంచే సాగుతుంది.. ఈ అవకాశాన్ని మనం చేజార్చుకోవద్దు..’’ అంటూ తన మాటల తీరుతో సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు గానీ, తాను ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేస్తున్నాననే సంగతి గ్రహించడం లేదు. ‘మూడు రాజధానులు- మూడు ప్రాంతాల అభివృద్ధి’ అని సర్కారు చెబుతోంటే అందుకు భిన్నంగా ధర్మాన మాటలు ఉన్నాయి. ‘‘అమరావతిలో ఏముంటుంది ఎప్పుడైనా శాసనసభ సమావేశాలు పెట్టాలనుకుంటే అక్కడికి వెళ్తారు అంతే’’ అని ధర్మాన తేల్చేస్తున్నారు. అక్కడివాళ్ల పుండుమీద కారం రాస్తున్నారు. ‘‘హైకోర్టు కర్నూలుకు వెళుతుంది. అయితే హైకోర్టుతో సంబంధం ఉండే వాళ్ళు న్యాయపరమైన వాళ్ళు, క్రిమినల్స్ మాత్రం అక్కడికి చేరుకుంటారు.. అంతకుమించి ఏమి ఉండదు’’ అని ధర్మాన భాష్యం చెబుతున్నారు! ఇలాంటి మాటలు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం మాత్రమే కాదు కదా.. ఆయా ప్రాంతాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మనోభావాలను కూడా గాయపరిచేవి. ఎంతో సీనియర్ అయిన ధర్మాన ప్రసాదరావు ఇంతకూ స్పృహలో ఉండే ఈ మాటలు మాట్లాడుతున్నారా లేదా అనేది ఆ పార్టీ వారికే అర్థం కావడం లేదు.
మహాభారతంలో కర్ణుడికి సారధ్యం చేస్తూ ఓటమికి దారి తీసేలా పనిచేసిన శల్యుడి పాత్రలాగా- ధర్మాన ప్రసాదరావు బాధ్యతగల మంత్రి పదవిలో ఉంటూ ఇలా ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. ఉత్తరాంధ్ర ప్రజలను సంతృప్తి పరుస్తున్నానని ఆయన తలపోస్తున్నారేమో తెలియదు కానీ.. తద్వారా పార్టీకి చేటు చేస్తున్నారని గుర్తించడం లేదు. ‘‘అమరావతిలో రాజధాని ఉంటే మరో 50 ఏళ్ల తర్వాత మనం అంటే ఉత్తరాంధ్ర విడిపోవలసి వస్తుంది’’ అనే అర్థం వచ్చేలా చెబుతున్న ధర్మాన ప్రసాదరావు… ఆయన చెబుతున్నట్లుగా విశాఖ ఒక్కటే రాజధాని అయితే గనుక ఎంతో దూరంలో ఉండే రాయలసీమ లాంటి ప్రాంతాల వారు ఇదే వేర్పాటువాదాన్ని ఆశ్రయిస్తారనే సంగతి ఎందుకు గుర్తించడం లేదు? దానికి తగ్గట్లుగా తాను బాధ్యతగా మాట్లాడాలని ఆయన ఎందుకు అనుకోవడం లేదు? అనేది పార్టీ నాయకులకు అంతుచిక్కడం లేదు!
ఆయన ఉత్తరాంధ్ర నుంచి ఎమ్మెల్యే అయి ఉండవచ్చు.. కానీ తాను ఉత్తరాంధ్రకు మాత్రమే మంత్రి కాదు, యావత్తు రాష్ట్రానికి మంత్రి అనే బాధ్యతను ధర్మాన ప్రసాదరావు గుర్తుంచుకుంటే.. ఇలా వేర్పాటువాదాన్ని రెచ్చగొట్టే మాటలు ఆయన నోటి నుంచి బయటకు రాకుండా ఉంటాయి.