పచ్చమీడియా ఒక్కసారిగా యాక్టివేట్ అయింది. వివేకా హత్యను కడప ఎంపీ అవినాష్ రెడ్డికి ముడిపెట్టడం ఎలా? అనే విషయంలో కొత్త కొత్త పద్ధతులను అన్వేషిస్తోంది. వాస్తవాలతో వారికి పనిలేదు, చివరికి దర్యాప్తు సంస్థ సీబీఐ చెబుతున్న వివరాలతో, వారి వాదనలతో కూడా నిమిత్తం లేదు.. తాము ఏం తలచుకుంటే అది చేయాలని, అవినాష్ హంతకుడు అని ప్రపంచం నమ్మేలా చేయాలని పచ్చ మీడియా తపన పడుతోంది. తద్వారా ముఖ్యమంత్రికి బురద పులమాలని ప్రయత్నిస్తోంది.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ప్రధాన నిందితుల్లో ఒకరైన సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా సీబీఐ కౌంటరు వేసింది. వారు కౌంటర్లో వివరాలను జాగ్రత్తగా గమనిస్తే ఎంపీ అవినాష్ రెడ్డి తలకు బలవంతంగా చుడుతున్నారని అర్థమవుతుంది. కేసులో నిందితులతో పరిచయం ఉండడం, వారు తన వర్గం వారు కావడం, హత్యకు ముందు వెనుక వారు తన ఇంటివద్ద ఉన్నారనడం మాత్రమే సీబీఐ కౌంటరులోని వివరాలు. వీటితో ముడిపెట్టి.. హత్య వెనుక ఉన్నది అవినాష్ రెడ్డే అని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు.
బెంగుళూరు సెటిల్మెంటుకు సంబంధించి వివేకానందరెడ్డి వాటా ఇవ్వకపోవడంతో పెంచుకున్న కక్ష హత్యకు దారితీసినట్లుగా సీబీఐ కౌంటరులోనే చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఆ కక్షతోనే హత్య చేసినట్లుగా కూడా వారి కౌంటరు ద్వారానే అర్థమవుతోంది. హత్యలో పాత్రధారులు కూడా.. వాటా మిస్సయిన గంగిరెడ్డి తదితరులే. అదంతా క్లియర్ గానే ఉంది.
కానీ, అదే సమయానికి రాజకీయ వాతావరణం కూడా వేడిగా ఉండడం, విభేదాలు ఉండడం అనేది పచ్చమీడియాకు కలిసి వచ్చింది. వాటిని ఆధారం చేసుకుని కథలు అల్లుతూ అవినాష్ కు ముడిపెట్టే ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. చివరకు శివశంకర్ రెడ్డి కొడుకు ఆస్పత్రి ప్రారంభోత్సవం సందర్భంగా ఫ్లెక్సిల్లో అవినాష్ రెడ్డి ఫోటో వేసుకోవడాన్ని కూడా వారిద్దరి అనుబంధానికి ఒక నిదర్శనంలాగా చూపించారంటే ఎంత కామెడీ చేస్తున్నారో అర్థమవుతుంది. ఫ్లెక్సిల్లో స్థానిక నాయకుడి ఫోటోను సాధారణ ప్రజలు కూడా చాలా విచ్చలవిడిగా వాడేసుకుంటూ ఉంటారు.
సీబీఐ కౌంటరులో ప్రధానంగా ఉన్న కీలక ఆరోపణ హత్యకు కొన్ని గంటల ముందు శివశంకర రెడ్డి తదితరులు అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నారనేది. దానిని వారు టెక్నికల్ గా కూడా నిరూపించవచ్చు. కానీ.. ఆ ఒక్క కారణంతో అవినాష్ ను నిందితుడిగా చూపించలేరు. ఎందుకంటే.. నిందితులు హత్య చేయదలచుకున్నప్పుడు బలమైన ఎలిబీకోసం తమకు పరిచయం ఉన్న నాయకుడి ఇంటికి వచ్చి , తర్వాత వెళ్లి తమ పథకం అమలు చేయడానికి అవకాశం ఉంది.
ఇలాంటి సంభావ్యతలు ఎన్నో ఉండగా.. దొరికిన కొన్ని వివరాలతో సీబీఐ కౌంటరు దాఖలు చేస్తే.. దానిని ఆధారంగా తాము చెప్పే భాష్యాలతో అవినాష్ రెడ్డి నిందితుడని ఇరికించడానికి పచ్చమీడియా పాట్లు పడుతున్నట్టుగా ఉంది.