“నేను ట్రెండ్ ఫాలో అవ్వను- సెట్ చేస్తా”- ఇది పవన్ కళ్యాణ్ సినిమా డైలాగ్. అది తెర వరకే పరిమితం. కానీ నిజజీవితంలో ఆ డైలాగ్ కి తగ్గట్టుగా నడుస్తున్న నాయకుడు జగన్ మోహన్ రెడ్డి. అదెలాగో చూద్దాం.
చంద్రబాబు ప్రాబల్యం తెదేపాపై ఉన్ననాటి నుంచి ఒక లెక్కుండేది. అదేంతంటే ఎమ్మెల్సీ అయినా రాజ్యసభ ఎంపీ టికెట్టైనా కావాల్సినవాళ్లు డబ్బిచ్చి కొనుక్కోవాల్సిందే. పార్టీకి ఫండ్ పేరుతో భారీ మొత్తాలు దండుకోవడం..ఎవరు ఎక్కువిస్తే వాళ్లని మండలికో, రాజ్యసభకో పంపించడం. ఇదే తంతు.
1983 ముందు కాంగ్రెస్ పార్టీలో అలాంటి బేరాలుండేవి కావు. తెదేపాని చూసి వాళ్లు కూడా కొంతవరకు భ్రష్టుపట్టారు. రకరకాల లాబీయింగులు, మంతనాలు జరిపి పెద్ద మొత్తాలకి ఆయా సీట్లు కొనుక్కునే బడా వ్యాపారులుండేవాళ్లు.
అలా డబ్బిచ్చి కొనుక్కున్న స్థానాల్ని అడ్డం పెట్టుకుని ఏ ప్రాజెక్టులిప్పించో, టెండర్లు గెలిపించో అంతకు రెండింతలో మూడింతలో సంపాదించుకునే వాళ్లు కూడా. అప్పట్లో సోషల్ మీడియా నిఘా అంతగా ఉండేది కాదు కనుక అన్నీ చెల్లుబాటైపోయేవి.
అలాగే చంద్రబాబుకి పదవున్నప్పుడల్లా పార్టీలో ఉన్న కమ్మవాళ్లు, ఎన్నారైలు రకరకాల మార్గాల ద్వారా డబ్బు దండుకునేవారు. పదవులన్నీ ఆ వర్గానివే. పదవి వచ్చే వరకు ఎస్సీలని, ఎస్టీలని, బీసీలని ఉద్ధరిస్తానని చెప్పి పదవి రాగానే వాళ్ళందరికీ మొండిచేయి చూపించడం చంద్రబాబు నైజం. సొంతసామాజిక వర్గాన్ని ఉద్ధరించుకోవడం తప్పు కాదు.. ఆ యావలో ఇతరులని, ఎస్సీలని, బీసీలని, ఎస్టీలని తొక్కేయడమే తెదేపా పతనానికి నాంది అయ్యింది. ఎందుకంటే అది అప్రజాస్వామికం కనుక.
వర్ల రామయ్యకి అప్పట్లో రాజ్యసభ సీటు ఇవ్వచూపాడు బాబు. పాపం ఆయన కొత్త బట్టలు కుట్టించుకుని మరీ నామినేషన్ వేయడానికి బయలుదేరితే ఆఖరి నిమిషంలో ఆయనని తప్పించి ఒక డబ్బున్న ఆసామి నుంచి భారీ మొత్తం పుచ్చుకుని ఆ సీటు కేటాయించేసిన ఘనచరిత్ర బాబుది. వేరే దారిలేక ఇప్పటికీ బాబుపంచన విశ్వాసంతో ఉన్న వ్యక్తి వర్ల. ఇదే తరహాలో మోత్కుపల్లి నుంచి ఇంకా ఎందరో దగా పడ్డ నాయకుల లిస్టు చెప్పుకుంటూ పోతే చాలా పెద్దదే ఉంటుంది.
ఇప్పుడీ పద్ధతిని జగన్ సమూలంగా మార్చేసాడు. ఒక కొత్త ట్రెండ్ సృష్టించాడు. ఎమ్మెల్సీ పదవులు వెనుకబడిన తరగతులవారికి బోళాగా పంచేస్తున్నాడు. అలాగే లక్షా ఎనభై వేల కోట్ల విలువైన స్కీముల్ని పంచుతున్నాడు.
భవిష్యత్తులో ఎవరు సీయం అయినా చచ్చినట్టు పంచాల్సిందే. ఎస్సీ, ఎస్టీ, బీసీలకి ఎమ్మెల్సీ, రాజ్యసభ పదవులు అధికంగా ఇవ్వాల్సిందే.
దమ్మున్న కుటుంబ పెద్ద తమ కుటుంబ సభ్యులకి కడుపునిండా పెట్టి, దర్జాగా జీవించే వసతులు కల్పించి ఆ ఖర్చులు అందుకోవడానికి కావాల్సిన తన మీద తనకి నమ్మకంతో పనిచేసి అధిక సంపాదన కోసం మార్గాలు అన్వేషిస్తాడు.
అంతే కానీ, “మన ఆదాయం ఇంతే…ఉన్నంతలో పస్తులుండైనా సర్దుకోవాల్సిందే..నేను పెద్దగా కష్టపడను..ఇంటి పెద్దని కాబట్టి నా విలాసాలకి డబ్బుంటుంది కానీ మీ సంక్షేమానికి లేవు” అనేవాడు సరైన కుటుంబపెద్ద ఎలా అవుతాడు? స్వార్ధపరుడవుతాడు. జగన్ అలా కాదు.
ఇక్కడే జగన్ ని చూసి నేర్చుకోవాలి. స్కీములిస్తున్నాడు. సంపాదన కోసం కడప లో ఇండస్ట్రియల్ హబ్ పెట్టి భారీగ పెట్టుబడులు కూడా తెచ్చాడు. ఎన్నో ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ లో మొదలయ్యాయి. ఇది ఇక్కడ రాస్తున్న రాత కాదు. 2019-2023 మధ్య ఆంధ్ర ప్రదేశ్ లో పెట్టుబడుల గురించి ఇంటెర్నెట్లో ఏ మూల వెతికినా జాతీయ మీడియాలో కనిపిస్తాయి. కానీ వాటికి ప్రచారం లభించదు. ఎందుకంటే స్కీముల ప్రచారంలో ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ అభివృద్ధి పనుల ప్రచారంలో లేకపోవడం. ఇది ముమ్మాటికీ ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ స్వయంకృతాపరాధమే. “సంక్షేమం సరే..అభివృద్ధి ఏది?” అని అడిగేవాళ్లకి నిజంగా చెప్పడానికి చాలా ఉంది. కానీ ఎందుకు చెప్పుకోరో అస్సలు అర్ధం కాదు.
అదలా ఉంటే కులాల గురించి ప్రస్తావన కాదు కానీ తెదేపా సామాజిక వర్గానిది ఒక్క పార్టీ వ్యవహారాల్లోనే కాదు తానా నుంచి ఫిల్మ్ చాంబర్ ఎన్నికల వరకు, కమ్మ సంఘం నుంచి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎలెక్షన్స్ వరకూ అన్నింట్లోనూ దాదాపు తొండాటే. లేని బలాన్ని కొనుక్కునో, లాక్కునో చూపించుకుని అధికారంలోకి రావడమే. వాపుని బలుపులా చూపించి కుర్చీ ఎక్కేయడమే. నిజంగా డొక్క చింపితే అంతా డొల్ల అని తెలిసిపోతుంది. ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని తెదేపా వర్గీయుల ఎత్తుగడలకి కాలం చెల్లిపోయింది. జనంలో ఒక వెగటు భావన వచ్చేసింది. అబద్ధాలని అక్షరసత్యాలుగా ఆస్వాదించే జనాభా బాగా తగ్గిపోయింది.
అయినప్పటికీ అబద్ధపు రాతలు నిస్సిగ్గుగా రాయడం ఏమాత్రం ఆపదు ఎల్లో మీడియా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కొత్తగా ఏ పరిశ్రమ తెచ్చినా అది ఒరిజినల్ గా చంద్రబాబు శ్రమ అని రాస్తాయి. ఇప్పుడు జగన్ ఏదైనా రోడ్డు వేయడం మొదలుపెడితే అది చంద్రబాబు టైములోనే మొదలైందని, కానీ జగన్ ఆపాడని చెప్తాయి. ఇలా ఎవరికి క్రెడిట్ వస్తున్నా అది పూర్తిగా లాగేసుకోవడం తెదేపా వారి నాయకత్వలక్షణం.
చంద్రబాబు తన హాయాములో ప్రతీదీ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించి ఆపేస్తాడు. తర్వాత వచ్చినవాళ్లు పూర్తి చేస్తారు. కానీ మొదలుపెట్టింది తానే అని క్రెడిట్ గుంజుకోవడానికి మాత్రం గోతికాడ నక్కలాగ కూర్చుంటాడు బాబు. కానీ ఎవరైనా తమ పదవీకాలంలో శంకుస్థాపన చేసాక తన కాలంలో పూర్తినైప్పుడు మాత్రం మొదలుపెట్టినవారి పేరు అసలు చరిత్రలో కనపడకుండా జాగ్రత్త పడతాడు. తన దృష్టిలో చరిత్రంటే ఈనాడు, జ్యోతిల్లో వచ్చే రాతలే.
కానీ ఎవరేది మొదలుపెట్టారో, ఎవరేది పూర్తి చేసారో సోషల్ మీడియా యుగంలో తోచింది చెప్పే వీల్లేదు. నిజాలు నోరు తెరిచి చూస్తుంటాయి.
ఎలా చూసుకున్నా జగన్ ట్రెండ్ సెట్టర్ అన్నది నిర్వివాదాంశం. చంద్రబాబైనా, పవనైనా, మరొకరైనా, వేరొకరైనా ఆ మార్గంలో నడవాల్సిందే. సిమౌల్ గా చెప్పాలంటే స్వార్ధవలయంలో ఉన్న ఎందరో నాయకుల్ని, ఎన్నో పార్టీలని ప్రజాస్వామ్యచక్రంలోకి లాక్కొచ్చిన నాయకుడు జగన్ మోహన్ రెడ్డి.
హరగోపాల్ సూరపనేని