అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్ల తరువాత ఒక్కో అంశం ఇపుడు వైసీపీ సర్కార్ కి కలసివచ్చేలా కనిపిస్తోంది. అందులో టాప్ మోస్ట్ ప్రయారిటీగా విశాఖ రైల్వే జోన్ చెప్పుకోవాలి. దీని వెనక యాభై ఏళ్ల కధలూ కలలూ ఉన్నాయి. విభజన చట్టం హామీలలో ఒకటైనా దీనిని కేంద్రం మంజూరు చేసినా మైలేజ్ మాత్రం వైసీపీకే దక్కబోతోంది.
ప్రధాని మోడీ విశాఖ టూర్ లో భాగంగా మరో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ కి శంకుస్థాపన చేయడానికి వైసీపీ సర్కార్ రెడీ అవుతోంది. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు కూడా ప్రధాని చేత భూమి పూజ చేయించాలని వైసీపీ ఆలోచిస్తూ వచ్చింది. కానీ హై కోర్టులో కేసులు ఉండడం చేత దాన్ని ప్రధాని ప్రోగ్రాం షెడ్యూల్ లో పెట్టడానికి పీఎంఓ ఇప్పటిదాకా రిజెక్ట్ చేస్తూ వచ్చినదని సమాచారం.
ఇపుడు ఎటూ హైకోర్టు ఈ విషయంలో అన్ని కేసులు కొట్టేస్తూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందువల్ల ప్రధాని చేతనే ఆ శంకుస్థాపన కార్యక్రమం చేయించడానికి వైసీపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది అని తెలుస్తోంది. అది కనుక జరిగితే శరవేగంగా వచ్చే ఎన్నికల్లోగా భోగాపురం ఎయిర్ పోర్ట్ మొదటి దశ పనులు పూర్తి చేసి జాతికి అంకితం చేయాలన్నది వైసీపీ ఆలోచనగా ఉంది.
ఇప్పటికి ఏడేళ్ల క్రితం తెలుగుదేశం ప్రభుత్వం హడావుడిగా ఈ ప్రాజెక్ట్ కి భూమి పూజ చేసింది. దాంతో రెండు వందల మంది దాకా నిర్వాసితులైన రైతులు కోర్టుకు వెళ్ళి ఆపేయించగలిగారు. అలా న్యాయ సమస్యలతో ఏళ్లకు ఏళ్ళుగా ఉన్న భోగాపురం ఎయిర్ పోర్టు ఇపుడు నిర్మాణపు పనులకు సిద్ధం కావడం విశేషంగా చెప్పుకోవాలి.
రెండేళ్ల క్రితమే భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణం కోసం ప్రభుత్వం టెండర్లను జీఎమ్మార్ సంస్థకు ప్రభుత్వం ఖరారు చేసింది. 2,400 ఎకరాలలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు నిర్మాణం మొదలెట్టిన రెండేళ్ళ వ్యవధిలో పూర్తి చేసేలా ఒప్పందం కూడా కుదిరింది. ఇపుడు ప్రధాని ప్రోగ్రాం షెడ్యూల్ లో చేసేందుకు ఏపీ సర్కార్ దీన్ని చూస్తోంది. అదే జరిగితే భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణంలోకి వచ్చేసినట్లే.