స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో టీడీపీ నాయకుడు అచ్చెన్నాయుడికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్లాస్ తీసుకున్నారని సమాచారం. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏఏ అంశాలపై చర్చించాలనే విషయమై తేల్చేందుకు బీఏసీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు, జగన్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగిందని తెలిసింది.
మీరు ఏ అంశం కావాలన్నా చర్చకు రెడీ. సభలో చర్చకు సహకరిస్తారా? లేదా? అని అచ్చెన్నను సీఎం జగన్ అడిగారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌పై చర్చిద్దామని అచ్చెన్నాయుడు కవ్వించే ప్రయత్నం చేశారు. ఓ ఎస్, దాంతో పాటు ఈఎస్ఐ స్కామ్ కూడా చర్చిద్దామని జగన్ దీటైన కౌంటర్ ఇచ్చారు. లిక్కర్ స్కామ్‌లో సీఎం సతీమణి భారతి పేరు వుందని టీడీపీ ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈఎస్ఐ స్కామ్‌లో అచ్చెన్నాయుడు జైలుకు వెళ్లి వచ్చారు. అందుకు పరోక్షంగా జగన్ గట్టి కౌంటర్ ఇచ్చారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులపై దుష్ప్రచారం చేయడంపై జగన్ అసహనం వ్యక్తం చేశారని సమాచారం. రాజకీయాల్లో పరస్పరం ఎన్నో విమర్శలు చేసుకుంటామని, ఏ సంబంధం లేని మహిళలను లాగడం ఎందుకని జగన్ ప్రశ్నించారని తెలిసింది.
వల్లభనేని వంశీ, కొడాలి నాని ఈ చెడు సంప్రదాయానికి శ్రీకారం చుట్టారని జగన్‌తో అచ్చెన్నాయుడు అన్నట్టు తెలిసింది. తాను రికార్డులన్నీ చూశానని, మొదట టీడీపీ వైపు నుంచి మొదలైందని జగన్ అన్నారని సమాచారం. కావున టీడీపీ నిలిపివేస్తే, తమ వాళ్లు కూడా ప్రత్యర్థుల కుటుంబాల్లోని మహిళలపై మాట్లాడరని జగన్ అన్నట్టు తెలిసింది.