తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరికి మాజీ మంత్రి కొడాలి నాని గాలి తీశారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా వికేంద్రకరణపై చేపట్టిన స్వల్పకాలిక చర్చలో కొడాలి నాని తనదైన శైలిలో పంచ్‌లతో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చారని చెప్పుకొచ్చారు.
తన సామాజిక వర్గం బలంగా ఉన్న రాయలసీమకు జగన్ రాజధాని తీసుకెళ్లలేదన్నారు. ఒక కులానికో, మతానికో వ్యతిరేకంగా వికేంద్రీకరణ చేయడం లేదన్నారు. చంద్రబాబు బినామీలు దళితులను భయపెట్టి అసైన్డ్ భూములను లాక్కున్నారని ఆరోపించారు. అమరావతిలో పేదలకు ఇళ్లు ఇస్తామంటే కోర్టుకెళ్లి అడ్డుకున్నారని విమర్శింరు. ఇదే తన వాళ్లైన సినీ పరిశ్రమ పెద్దలు అశ్వనీదత్, రాఘవేంద్రరావు వంటి వారికి మాత్రం రాజధాని ప్రాంతంలో కోరుకున్న చోట భూములిచ్చారని విమర్శించారు. చంద్రబాబు తనకు కావాల్సిన వారికి కారుచౌకగా భూములు కట్టబెట్టారని తప్పు పట్టారు.
అమరావతిలో ధనికులే ఉండాలా.. పేదలు ఉండొద్దా? అని నిలదీశారు. అమరావతిని కమ్మరావతి, భ్రమరావతి చేసింది చంద్రబాబు కాదా? అని ఆయన ప్రశ్నించారు. అమరావతి ప్రకటించక ముందు ఎకరం రూ.50లక్షలు ఉంటే గ్రాఫిక్స్‌తో ఎకరం రూ.5కోట్లకు తీసుకెళ్లారన్నారు. ఎక్కడో రాజమండ్రిలో ఆస్తులమ్ముకుని ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి అమరావతిలో భూములు కొన్నారన్నారు. తీరా ఇప్పుడు రాజధాని మార్పుతో అమరావతి ప్రాంతంలో భూముల రేట్లు అమాంతం పడిపోయాయన్నారు. అమరావతిలో మూడెకరాల భూమిని బుచ్చయ్య చౌదరి రూ.3 కోట్లకు కొన్నారని, ఇప్పుడు రేట్లు లేవన్నారు. ఇదే రాజమండ్రిలో అమ్మిన భూమి విలువ రూ.11 కోట్లు చేస్తోందని బుచ్చయ్య చౌదరి బాధపడుతున్నారని వెటకరించారు.
ఇలా అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వాళ్లందరూ జగన్ ఓడిపోవాలని కోరుకుంటున్నారని నాని చెప్పారు. అమరావతిని చంద్రబాబు రియల్ ఎస్టేట్ కంపెనీగా మార్చారని విమర్శించారు. అమరావతి కోసం పాదయాత్ర చేయడం లేదన్నారు. చంద్రబాబును సీఎం చేసేందుకు అమరావతి పేరుతో పాదయాత్ర చేస్తున్నారని కొడాలి నాని ఘాటు విమర్శలు చేశారు.
ఖమ్మంలో కార్పొరేటర్‌గా గెలవలేని రేణుకా చౌదరి అమరావతి గురించి మాట్లాడటమా? అని నిలదీశారు. ఇటీవల పాదయాత్ర ప్రారంభం నాడు రేణుకా చౌదరి వచ్చి హల్‌చల్ చేసిన సంగతి తెలిసిందే. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆమెపై కొడాలి పంచ్ విసిరారు.