తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసనీయమైన పని చేశారు. తెలంగాణలో కొత్తగా నిర్మిస్తున్న సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు చర్యలు చేపట్టాలని చీఫ్ సెక్రటరీ సోమేశ్‌కుమార్‌ను సీఎం ఆదేశించారు.
ఢిల్లీలో కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలంటూ తెలంగాణ అసెంబ్లీ రెండు రోజుల క్రితం తీర్మానించింది. ఈ తీర్మానాన్ని బీజేపీ మినహా కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు మద్దతు పలికాయి. రాజకీయంగా బీజేపీని ఆత్మరక్షణలో పడేసేందుకే కొత్త పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలనే డిమాండ్‌ను టీఆర్ఎస్ తెరపైకి తెచ్చిన సంగతి తెలిసిందే.
ఇదే సందర్భంలో తెలంగాణలో నిర్మిస్తున్న కొత్త సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టాలనే డిమాండ్లు పౌర సమాజం నుంచి వచ్చాయి. దీన్ని రాజకీయంగా అనుకూలంగా మార్చుకునేందుకు కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేశారు.
కొత్త సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టేందుకు ముందుకొచ్చారు. దీంతో మోదీపై మరింత ఒత్తిడి పెంచేందుకు కేసీఆర్‌కు అవకాశం దొరికినట్టైంది. తాను దళితుల అనుకూల నాయకుడిగా, అలాగే బీజేపీ వ్యతిరేక పార్టీగా ముద్ర వేసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం పావులు కదుపుతోంది. అంబేద్కర్ పేరు ఎంత వరకు రాజకీయంగా ఉపయోగపడుతుందో చూడాలి.