వివాదాలను వాటేసుకోవడం జగన్‌కు అవసరమా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతటి గొప్ప నాయకులకైనా ఇవ్వదగిన అత్యున్నత స్థాయి నామినేటెడ్ పోస్టులలో తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి పదవులే అత్యంత విశిష్టమైనవి. ఈ పదవులను దక్కించుకోవడానికి అధికార పార్టీలో ఉండే ఉద్దండుల…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతటి గొప్ప నాయకులకైనా ఇవ్వదగిన అత్యున్నత స్థాయి నామినేటెడ్ పోస్టులలో తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి పదవులే అత్యంత విశిష్టమైనవి. ఈ పదవులను దక్కించుకోవడానికి అధికార పార్టీలో ఉండే ఉద్దండుల పైరవీలు చాలా పెద్ద స్థాయిలో సాగుతూ ఉంటాయి. 

ప్రభుత్వానికి పార్టీకి ఎంతో సేవలు అందించిన వారికి, మరింతగా ఉపయోగపడగల వారికి మాత్రమే ప్రభుత్వం ఈ పదవులను కట్టబెడుతూ ఉంటుంది. అయితే టీటీడీ సభ్యులను నియమించే రూపంలో జగన్మోహన్ రెడ్డి కొత్త వివాదాలను తనకు తానుగా పిలిచి వాటేసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలకమైన నిందితులలో ఒకరైన వెనక శరత్ చంద్రారెడ్డి ని టీటీడీ బోర్డు సభ్యుడుగా నియమించడం అనేది ఇప్పుడు సర్వత్రా వివాదాస్పదం అవుతోంది. ధర్మకర్తల మండలిలో మొత్తం 24 మంది సభ్యులు ఉండగా అందులో ఒకే ఒక్క శరత్ చంద్రారెడ్డి గురించి రేగినంత రచ్చ మరొకరి విషయంలో తలెత్తలేదు. శరత్ చంద్రారెడ్డి కి టీటీడీ పదవిని కట్టబెట్టడం ద్వారా- ముఖ్యమంత్రి ఆయన చేసిన నేరాలు అన్నింటిని సమర్ధించినట్లుగా ఉన్నదని ప్రత్యర్థులు మాత్రమే కాదు తటస్థులు కూడా ఆరోపణలు చేస్తున్నారు.

ఈ రకమైన నిర్ణయం ద్వారా జగన్మోహన్ రెడ్డి ఏం సాధించారు? అనేది పార్టీ కార్యకర్తలకు కూడా కలుగుతున్న సందేహం. ఎందుకంటే ఈ నియామకం కచ్చితంగా శరత్ కు జగన్ అండగా నిలుస్తున్నారనే సంకేతాలను పంపుతుంది. 

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆయనకు ప్రస్తుతం బెయిలు వచ్చిందే తప్ప నిర్దోషిగా నిరూపణ కాలేదు. అలాంటప్పుడు అంతగా ఆయనకు మేలు చేయదలచుకుంటే ఆయన కుటుంబం నుంచి ఎవరో ఒకరికి టిటిడి బోర్డు పదవి ఇచ్చి ఉండవచ్చు. అలాకాకుండా బెయిలు పై ఉన్న నిందితుడిని ఆలయ ధర్మకర్తల మండలిలో చూడడం అనేది చాలా చిన్నతనంగా ఉందని సొంతపార్టీ వారే వ్యాఖ్యానిస్తున్నారు.

ఈ రకంగా- ఉన్నవి చాలవన్నట్లుగా కొత్త వివాదాలను తగిలించుకుని, అందులో చిక్కుకోవడం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి రివాజుగా మారిపోయింది. ఇలా నేరాల్లో చిక్కుకుని ఉన్నవారు తప్ప.. టీటీడీ లాంటి పదవిని కట్టబెట్టడానికి జగన్ కు మరొక వ్యక్తి దొరకలేదా? అని పలువురు విమర్శిస్తున్నారు.