ఉమ్మడి నెల్లూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్నారు. చాపకింద నీరులా సొంత ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. అధికారులను ప్రశ్నిస్తున్న పేరుతో సీఎం జగన్‌ను పరోక్షంగా నిలదీస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా నెల్లూరు రూరల్, వెంకటగిరి ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి తమ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగడం లేదని, ప్రజలకు మొహాలు ఎలా చూపాలని నిలదీస్తున్నారు.
అధికార పార్టీ ఎమ్మెల్యేల విమర్శలు ప్రత్యర్థులకు ఆయుధాలు ఇస్తున్నట్టైంది. ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు సీఎం జగన్‌ను కలవాలని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వర్తమానం అందింది. ఈ నేపథ్యంలో కోటంరెడ్డి విజయవాడకు వెళ్లినట్టు తెలిసింది. సాయంత్రం సీఎం భేటీకి ఆ జిల్లా ఇన్‌చార్జ్ నేత బాలినేని శ్రీనివాస్‌రెడ్డి కూడా ఆహ్వానం అందినట్టు తెలిసింది. సీఎం భేటీ తర్వాత కోటంరెడ్డి ఏమంటారో చూడాలి.
ఇదిలా వుండగా కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కంటే ముందుగా ఆనం రామనారాయణరెడ్డి నిరసన గళం వినిపిస్తున్నారు. కానీ ఆయన్ను మాత్రం సీఎం జగన్ పట్టించుకోలేదనే అభిప్రాయాలున్నాయి. ఆనం రామనారాయణరెడ్డి ఎలాగూ పార్టీలో కొనసాగరనే అభిప్రాయంలో సీఎం జగన్ ఉన్నట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అందువల్లే ఆనం వ్యాఖ్యల్ని లైట్ తీసుకున్నట్టు తెలుస్తోంది.
కోటంరెడ్డితో భేటీ తర్వాత ఆనంను కూడా పిలిచి సీఎం మాట్లాడే అవకాశాలున్నాయని మరికొందరు అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. మొత్తానికి వైసీపీ ఎమ్మెల్యేల అసంతృప్తి వైసీపీ అధిష్టానాన్ని కలవరపెడుతోంది.