జనసేనాని పవన్‌కల్యాణ్ ఆచితూచి ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. గుంటూరులో చంద్రబాబు సభలో తొక్కిసలాట జరిగి ముగ్గురు మహిళలు మృత్యువాత పడడంపై పవన్ ఎందుకు స్పందించడం లేదని మాజీ మంత్రి పేర్ని నాని ఇవాళ ఉదయం ట్విటర్ వేదికగా ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కాసేపటికే చంద్రబాబు సోషల్ మీడియాలో ఓ ప్రకటన విడుదల చేయడం గమనార్హం. ఎక్కడా టీడీపీపై ఈగ వాలనివ్వకుండా, చంద్రబాబు మనసును నొప్పించకుండా పవన్‌కల్యాణ్ ప్రెస్ నోట్‌ను విడుదల చేయడం విశేషం.
కేవలం వైసీపీ విమర్శలను తట్టుకోలేక అన్న రీతిలో పవన్ తాజా స్పందన ప్రతిబింబిస్తోంది. అంతే తప్ప పేద మహిళలు ప్రాణాలు కోల్పోయారనే ఆవేదన, అందుకు దారి తీసిన పరిస్థితులపై ఆగ్రహం పవన్ ప్రకటనలో కనిపించకపోవడం గమనార్హం. గుంటూరు నగరంలో చంద్రన్న కానుకలో పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట జరగడం దురదృష్టకరమని ఆయన అభిప్రాయపడ్డారు.
ముగ్గురు పేద మహిళలు చనిపోవడం దిగ్భ్రాంతి కలిగించిందని వాపోయారు. మృతుల ఆత్మకు శాంతి కలగాలని దైవాన్ని ప్రార్థిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. వారి కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. కందుకూరు టీడీపీ సభ తొక్కిస లాటలో 8 మంది మృతి చెందడాన్ని మరిచిపోకనే, ఇప్పుడు గుంటూరులో అలాంటి దుర్ఘటనే చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోందని పవన్ తెలిపారు.
ఇలాంటి కార్యక్రమాల విషయంలో నిర్వాహకులు పటిష్టమైన చర్యలు చేపట్టాలని, అలాగే పోలీసులు తగిన భద్రత ఏర్పాట్లు చేయాలని పవన్ కల్యాణ్ సూచించడం విశేషం. పేద మహిళల ప్రాణాలు పోవడం కంటే చంద్రబాబుకు రాజకీయంగా నష్టం జరగకూడదనే తపన పవన్‌లో ఎక్కువగా కనిపిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.