విశాఖలోని శారదాపీఠంలో రాజశ్యామల అమ్మవారిని దర్శించుకోవడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వచ్చారు. ఆయన ఆధ్యాత్మిక పూజాది కార్యక్రమాలలో పాలు పంచుకున్నారు. జగన్ రాకతో విశాఖ వైసీపీ నేతలలో సందడి నెలకొంది. ఎమ్మెల్యేలు కీలక నేతలు అంతా పీఠానికి చేరుకుని వరసబెట్టి జగన్ కి శాలువాలు కప్పారు. కొందరైతే పాదాభివందనాలు కూడా చేశారు.
ఎన్నికల సీజన్. టికెట్ వ్యవహారం తెగని వారు ఉన్నారు. ఆశావహులు ఉన్నారు. ఆ హడావిడి అంతా పీఠం దగ్గర కనిపించింది. జగన్ కూడా వేసిన కండువాలను తీసుకుని తిరిగి వారికే కప్పారు. పాదాభివందనం చేసే నాయకులను ఆయన మధ్యలోనే లేపి వెన్ను తట్టారు.
పెందుర్తి సిట్టింగ్ ఎమ్మెల్యే అదీప్ రాజ్ జగన్ కి తాను తెచ్చిన కండువా కప్పబోగా జగన్ దాన్ని తిరిగి ఆయనకే కప్పేశారు. దాంతో అధినేత ఆంతర్యం ఏమిటి ఎమ్మెల్యే వెంట వచ్చిన అనుచరులకు అర్ధం కాలేదు. గాజువాక టికెట్ కోసం చూస్తున్న మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తిరెడ్డి కూడా కండువాను కప్పబోతే ఆయనకే జగన్ వేసేశారు.
ఇలా జగన్ తన వద్దకు వచ్చిన పార్టీ నేతలను పలకరిస్తూనే నొప్పించక తానొవ్వక అన్న తీరులోనే ముందుకు సాగిపోయారు. అమ్మవారి ఆశీస్సులు అందుకునేందుకు జగన్ పీఠానికి వస్తే ఆయన ఆశీస్సుల కోసం వైసీపీ నేతలు క్యూ కట్టారు. అయితే జగన్ మాత్రం అందరికీ ఒక్కటే నవ్వు. ఒకటే పలకరింపు అన్నట్లుగానే వ్యవహరించారు.
దీంతో దీని అర్ధమేమిటి అని తర్కించుకోవడం ఆశావహుల సిట్టింగుల వంతు అయింది. కండువాలు తిరిగి కప్పారు అంటే అది అప్యాయతా లేక మరేమైనా ఉందా అన్నది కూడా ఎవరికి వారు ఆలోచనలు చేసుకుంటున్నారు. తమకు గ్యారంటీ దక్కుతుందేమో అని ఆశలు పెట్టుకున్న వారికి మాత్రం సీఎం ఆ అవకాశాన్ని ఎక్కడా ఇవ్వలేదు అని వైసీపీలో డిస్కషన్ అయితే నడుస్తోంది.