ప్రధాని నరేంద్రమోడీ తాయిలాల రాజకీయాల గురించి చాలా వెటకారంగా మాట్లాడుతూ ఉంటారు. ప్రజలకు ఉచిత పథకాల గురించి ఆయనకు చాలా చులకన భావం ఉంది. ఉచిత పథకాల రాజకీయాలు దేశానికి, ఆర్థిక వ్యవస్థకు చేటు చేస్తాయని ప్రధాని మోడీ పలు సందర్భాల్లో ప్రకటించారు కూడా.
అయితే ఈ మాటమీద ఆయనకు ఉన్న చిత్తశుద్ధి ఎంత అనేది ఇప్పుడు తేలిపోనున్నది. ఉచిత పథకాలు చేటుచేస్తాయనే మాట కేవలం.. రాజకీయ ప్రత్యర్థుల్ని, ప్రాంతీయ పార్టీలను ఆడిపోసుకోవడానికి మాత్రమే ఆయన ప్రయోగిస్తూ వచ్చారా? నిజంగానే, ఆ సిద్ధాంతం మీద ఆయనకు, భారతీయ జనతా పార్టీకి చిత్తశుద్ధి ఉన్నదా? అనేది ఇప్పుడు నిరూపణ కాబోతోంది.
మార్చి 3వ తేదీన కేంద్ర కేబినెట్ సమావేశం జరగబోతోంది. మార్చి 12 వ తేదీన లోక్ సభ సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడుతుందని ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో నోటిఫికేషన్ కు ముందుగా జరగబోతున్న కేంద్ర కేబినెట్ సమావేశానికి సహజంగానే చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఈ కేబినెట్ భేటీలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది.. అనేదానిపై ప్రజలందరిలోనూ ఆసక్తి ఏర్పడుతోంది.
ఎన్నికల నేపథ్యంలో ప్రజలను ఆకర్షించడానికి, ఓట్లను కొల్లగొట్టడానికి ఈ కేబినెట్ లో కొత్త నిర్ణయాలు వస్తాయా లేదా అనేది ఆసక్తికరం. మోడీ పలు సందర్భాల్లో ఉచిత పథకాలు అనేవి దేశ ఆర్థిక వ్యవస్థకు చేటు చేస్తాయనే మాట వాడుతున్నప్పటికీ ఆ పార్టీ నూటికి నూరుశాతం అలాంటి సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నదని చెప్పలేం.
ఎందుకంటే.. కేంద్రం ఆధ్వర్యంలో నడుస్తున్న ఉచిత పథకాలు కూడా అనేకం ఉన్నాయి. వాటిని చూపి, తమది సంక్షేమ ప్రభుత్వంగా ఆ పార్టీ డప్పుకొట్టుకుంటూనే ఉంటుంది. అయితే రాష్ట్రాల్లో.. ప్రధానంగా భాజపాయేతర ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నచోట్ల పర్యటించేప్పుడు.. వారు అమలు చేస్తున్న పథకాల గురించి ఎద్దేవా చేస్తూ మోడీ ఇలాంటి మాటలు అంటుంటారు.
కానీ.. ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి. రామాలయం ప్రారంభం కావడం ఈ ఎన్నికల్లో కాపాడుతుందనే నమ్మకం ఉన్నప్పటికీ.. అన్ని రకాల ప్రయత్నాలూ చేయాలనే మోడీ దళం భావిస్తోంది. అందులో భాగంగా ఈ కేబినెట్ భేటీలో కొత్త తాయిలాలను ప్రకటించే ప్రయత్నం చేస్తారో లేదో చూడాలి.
అలాంటి పని చేస్తే గనుక.. మోడీ ప్రవచనాల రూపంలో సుద్దులు చెబుతారే తప్ప ఆచరణకు వచ్చేసరికి అందరిలాంటి పాలిటిక్స్ నడుపుతారని ప్రజలు ఒక నిర్ణయానికి వస్తారు. లేదా ఈ కేబినెట్ భేటీని ఇతర విషయాలకు మాత్రం పరిమితం చేస్తే.. ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఎర వేసే ఉద్దేశం లేదని ప్రజలకు తెలుస్తుంది. తాయిలాల రాజకీయాలు నష్టదాయకం అనే మాట పట్ల ఆయనకు చిత్తశుద్ధి ఉన్నదని కూడా అర్థం చేసుకుంటారు. ఏం జరుగుతుందో చూడాలి.