ప్రతిపక్షం, ఎల్లో మీడియాపై మరోసారి విరుచుకుపడ్డారు ముఖ్యమంత్రి జగన్. వాళ్లు ఎంతమంది కలిసినా తన వెంట్రుక కూడా పీకలేరని మాస్ డైలాగ్ చెప్పారు. అమ్మ ఒడి మూడో విడత నిధుల విడుదల కార్యక్రమాన్ని శ్రీకాకుళంలో ప్రారంభించిన ముఖ్యమంత్రి.. చదువు మీద పెట్టే ప్రతి పైసాను పవిత్రమైన పెట్టుబడిగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాల వైఖరిని మరోసారి తిప్పికొట్టారు.
“ఈరోజు నేను ప్రత్యక్షంగా యుద్ధం చేయడం లేదు. కుయుక్తులు, కుతంత్రాల మధ్య పరోక్షంగా యుద్ధం చేస్తున్నాను. నాకు, చంద్రబాబుకు మాత్రమే యుద్ధం కాదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5తో కూడా నేను యుద్ధం చేస్తున్నాను. నేను ఒక్కడ్నే, వాళ్లు దుష్టచతుష్టయం. వీళ్లకు దత్తపుత్రుడు కూడా తోడయ్యాడు. వీళ్లందరితో నేను ఒక్కడ్నే యుద్ధం చేస్తున్నాను. ప్రజల ఆశీస్సులు ఉన్నంతవరకు వీళ్లు నా వెంట్రుక కూడా పీకలేరు. నాకు మీరు ఉన్నారు, అది చాలు.”
చంద్రబాబు, ఎల్లో మీడియా చేస్తున్న ప్రచారాన్ని నమ్మొద్దని పిలుపునిచ్చారు జగన్. మంచి జరుగుతుందా లేదా అనేది మాత్రమే చూడాలని కోరారు. మంచి జరుగుతుంటే చంద్రబాబుకు నచ్చదని, అందుకే ఈ దుష్ప్రచారం జరుగుతోందన్నారు.
“దుష్ట చతుష్టయం చేస్తున్న దుష్ర్పచారాన్ని నమ్మకండి. కేవలం ఒకే ఆలోచన చేయండి. మన ప్రభుత్వం ద్వారా మన ఇంట్లో మంచి జరిగిందా లేదా అనేది మాత్రమే కొలబద్దగా తీసుకోండి. జగన్ వల్ల మీకు మంచి జరిగిందనిపిస్తే మద్దతివ్వండి. దేవుడి దయతో మీకు మరింత మంచి చేసే రోజులు రావాలి.”
మూడో విడత అమ్మఒడిలో భాగంగా దాదాపు 44 లక్షల మంది తల్లుల ఖాతాల్లో 6595 కోట్ల రూపాయల డబ్బును జమ చేశారు జగన్. ఏ దశలోనూ పిల్లల చదువును ఆగనీయనని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు.