కొందరంతే.. తమకు అనువైన చోటనే ఉండగలరు! ఏదో అవకాశం కొద్దీ, అవసరం కొద్దీ కొన్ని చోట్లకు చేరినా.. అక్కడ వారికి తగిన ఆదరణ, అవకాశాలు లభించినప్పటికీ.. ఎందుకో అక్కడ సర్దుకోలేరు! పచ్చి అవకాశవాదం అనలేం, బహుశా వారికి కంఫర్ట్ ఉండదు కాబోలు, శాలరీలో హైక్ ఇచ్చిన కొత్త కంపెనీని వదులుకుని, పాత శాలరీతో పాత ఆఫీసుకే తిరిగి వెళ్లిపోయే ఉద్యోగుల్లా ఉంటుంది వీరి వ్యవహారం. ఆ తరహా నిర్ణయాలను ఎవ్వరూ తీసుకోరు! అయితే కొందరు అలాంటి వింత వస్తువుల్లానే వ్యవహరిస్తూ ఉంటారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కొందరు నేతల పరిస్థితి ఇలానే ఉందని సమాచారం.
గత ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఒక ఐదారు మంది నేతల చూపు ఇప్పుడు మళ్లీ పసుపు పార్టీ మీదే పడిందని టాక్! వీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తిరిగి తెలుగుదేశం వైపు చూస్తున్నారట. అయితే ఈ చూపుల్లో అంతరార్థం తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారం దక్కించేసుకుంటుంది, ఆ పార్టీ తరఫున తాము వెలిగిపోతాం అనేది ఏమీ కాదు. వారి వ్యక్తిగత అభిరుచుకులు, వ్యవహారాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వారు సర్దుకోలేకపోతున్నారట! వీరి తత్వానికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలకూ అస్సలు పడటం లేదు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా తమకు ఉండే విలువ కన్నా, అధికారంలో లేకపోయినా తెలుగుదేశం పార్టీలో ఉండే తృప్తే వీరికి ఎక్కువ అనిపిస్తున్నట్టుగా ఉంది. అందుకే ఈ నేతలు తిరిగి తెలుగుదేశం వైపు తరలిపోయే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే ఇప్పటికిప్పుడే మాత్రం కాదు. ఇంకా ఎన్నికలకు సమయం ఉంది. ఎన్నికలు సమీపించినప్పుడే వీరు పూర్తిగా బయట పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి.
ఈ జాబితాలో ఇద్దరు ఎంపీల పేర్లు ప్రముఖంగా వినిపిస్తూ ఉన్నాయి. గ్రేటర్ రాయలసీమ పరిధిలోని వారే వారిద్దరూ. ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన సదరు నేతలు గతంలో తెలుగుదేశం పార్టీలో మెలిగిన వారే. వారిలో ఒకరికి అయితే కాంగ్రెస్ చరిత్ర ఉంది. కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలో కంచుకోటలాంటి నియోజకవర్గంలో గెలుస్తూ… వ్యవహారాలను చక్క బెట్టుకోవడంపైనే వారికి శ్రద్ధ ఎక్కువ. అయితే కాంగ్రెస్ పార్టీ పతనంతో వాస్తవంగా సదరు నేత ప్రాంతీయ పార్టీల్లో మెలగలేకపోతున్నారట కూడా! ముందుగా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసినా విజయం దక్కలేదు. గెలవాలంటే తప్పక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత ఎన్నికల్లో ఆయన టీడీపీ తరఫున పోటీ చేసి ఉన్నా.. ఓటమే మిగిలేది.
ఇక వచ్చేసారి కూడా ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసినా ఒరిగేది ఏమీ ఉండదు. అయినప్పటికీ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఆయన మనస్ఫూర్తిగా ఉండలేకపోతున్నారని, తెలుగుదేశం పార్టీ వైపే ఆయన చూపు ఉందనే టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పటి వరకూ చర్యల పరంగా అలాంటి సంకేతాలు ఇవ్వలేదు. గుంభనంగానే ఉంది వ్యవహారం.
ఇక ఆ పక్క జిల్లా ఎంపీ కూడా ఒకరు తెలుగుదేశం పార్టీలో పని చేసిన అనుభవం ఉన్న వారే. అక్కడ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి నెగ్గడం గగనమైన వ్యవహారమే. అది అర్థం చేసుకుని గత ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకుని నెగ్గారు. అయితే హోదాతో ప్రశాంతంగా ఉండటం లేదట సదరు నేత. పాత పరిచయాలో.. ఏమో కానీ.. మళ్లీ తెలుగుదేశం పార్టీ వైపు చూసే ఆసక్తి ఉందట ఆయనకు.
అయితే ఈ ఇద్దరు నేతల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దగా టెన్షన్ పడేదేమీ లేదు. ఎందుకంటే.. ఆ నియోజకవర్గాల్లో వీరు కాకపోయినా, మరెవరు పోటీ చేసినా.. విజయం విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది లేదు! వీరు కాకపోతే.. ఎవ్వరు పోటీ చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాయి ఆ రెండు ఎంపీ సీట్లు. దీంతో వీరిని బుజ్జగించే ప్రయత్నాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ఉండకపోవచ్చు. అందులోనూ వారు గుంభనంగా ఉన్న నేపథ్యంలో.. వీటిని రూమర్లుగా మాత్రమే పరిగణించాల్సి ఉంది.
ఇక నెల్లూరు జిల్లాలో ఒక కాంగ్రెస్ మాజీ నేత, ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇటీవలే ఆయన కూతురు వెళ్లి చంద్రబాబుతో సమావేశం అయ్యారు. ఆ అంశంపై ఆయన మాట్లాడుతూ..తన కూతురు కుటుంబం ముందు నుంచి తెలుగుదేశమే అని వివరణ ఇచ్చుకున్నారు. అయితే ఆయన కూతురు వెళ్లి చంద్రబాబును కలిసినా, ఆయనే వెళ్లి లోకేష్ తో సమావేశం అయినా.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం లైట్ తీసుకునే పరిస్థితి కనిపిస్తోంది.
ఇంకా మరి కొందరు కూడా ఈ తరహా ప్రణాళికలతోనే ఉన్నట్టుగా సమాచారం. ఈ వ్యవహారాలు రానున్న రోజుల్లో మరింతగా బయట పడి రక్తి కట్టే అవకాశాలుంటాయి.