ఆయనకు ఏమిటీ కాన్ఫిడెన్స్ ….ఎందుకోసం…?

దర్శకుడు రాఘవేంద్రరావు ఎంత సక్సెస్ ఫుల్ డైరెక్టరో ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. ఎన్నో బ్లాక్బస్టర్స్ నిర్మించి తెలుగు సినిమా రంగంలో చరిత్ర సృష్టించారని చెప్పొచ్చు. ఆయన ప్రత్యక్షంగా రాజకీయాల్లో లేకపోయినా బలమైన రాజకీయ అభిప్రాయాలు…

దర్శకుడు రాఘవేంద్రరావు ఎంత సక్సెస్ ఫుల్ డైరెక్టరో ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. ఎన్నో బ్లాక్బస్టర్స్ నిర్మించి తెలుగు సినిమా రంగంలో చరిత్ర సృష్టించారని చెప్పొచ్చు. ఆయన ప్రత్యక్షంగా రాజకీయాల్లో లేకపోయినా బలమైన రాజకీయ అభిప్రాయాలు ఉన్నాయి. 

అభిమాన నాయకులు ఉన్నారు. ఆయన బలమైన రాజకీయ అభిప్రాయం ఏపీని పరిపాలించే అర్హత, సామర్ధ్యం తెలుగు దేశం పార్టీకే ఉన్నాయని. ఆయన అభిమాన నాయకులు ఎన్టీ రామారావు, ప్రస్తుత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. వారిని తప్ప ఆయన వేరేవారిని తలచుకోను కూడా తలచుకోడు. ఆయనకు పెద్దాయన ఎన్టీఆర్ తో ఉన్న అనుబంధం చాలా ప్రత్యేకమైంది. 

1963లో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా భీముని పాత్ర పోషిస్తున్న ఎన్టీఆర్‌కు క్లాప్‌ కొట్టానని, ఆయనతో తీసిన 12 సినిమాలు బ్లాక్‌బస్టర్‌ అయ్యాయని రాఘవేంద్రరావు చెబుతుంటారు. ఒకప్పుడు ఎంతో బిజీగా ఉన్న రాఘవేంద్ర రావు వయసు రీత్యా, సినిమా రంగంలో మారిన పరిస్థితుల రీత్యా ఖాళీగా ఉన్నారు. కానీ ఆయనలో ఉత్సాహం మాత్రం తగ్గలేదు.  

తాజాగా రాజకీయంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. రెండేళ్లలో రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావటం ఖాయమని ధీమా వ్యక్తం చేసారు. బాపట్ల జిల్లా చుండూరు మండలం నడిగడ్డపాలెంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు.

రోజురోజుకూ ప్రజల్లో టీడీపీకి ఆదరణ పెరుగుతోందని చెప్పుకొచ్చారు. చంద్రబాబు అధికారం చేపట్టడం తథ్యమని జోస్యం చెప్పారు. టీడీపీ కార్యకర్తలు ఇదే ఉత్సాహం కొనసాగించాలని సూచించారు. టీడీపీ ఎన్నికల ప్రచారం కోసం గతంలో ప్రకటనలకు సైతం దర్శకత్వం వహించారు. అదే విధంగా రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత నాటి చంద్రబాబు ప్రభుత్వం ఆయను టీటీడీలో ఎస్వీబీసీ ఛానల్ ఛైర్మన్ గా నియమించింది. 

అప్పటికే టీటీడీ బోర్డు ఛైర్మన్ గా ఆయన పేరు ప్రచారం జరిగినా.. ఎస్వీబీసీ అప్పగించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన ఆ పదవి నుంచి తప్పుకున్నారు. ఇక, జగన్ సీఎం అయిన తరువాత సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అనేక అంశాల పైన మెగాస్టార్ చిరంజీవితో పాటుగా పలువురు ప్రముఖులు కలిసి చర్చలు చేసారు. వారిలో దగ్గుబాటి సురేష్.. రాజమౌళి వంటి వారు ఉన్నారు.

సినిమా టిక్కెట్ల వ్యవహారం పైన జరిగిన చర్చల్లోనూ పలువురు నిర్మాతలు..తరువాత హీరోలు మహేష్ బాబు.. ప్రభాస్ వంటి వారు చిరంజీవితో కలిసి సీఎంను కలిసారు. కానీ, ఆ చర్చల్లో సినీ ఇండస్ట్రీలో ప్రముఖుడైన రాఘవేంద్ర రావు సీఎం జగన్ ను కలిసేందుకు ముందుకు రాలేదు. అదే సమయంలో ప్రభుత్వం పైనా ఎటువంటి విమర్శలు చేయలేదు. ఎన్టీఆర్ హయాం నుంచి నందమూరి కుటుంబంతో సత్సంబంధాలు కలిగిన రాఘవేంద్ర రావు ఇప్పుడు ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో పాల్గొంటున్నారు. 

ఇక, రెండేళ్లలో చంద్రబాబు అధికారం చేపట్టటం ఖాయమంటూ రాఘవేంద్ర రావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ తో పాటుగా సినీ వర్గాల్లోనూ ఆసక్తికర చర్చకు కారణమవుతోంది. టీడీపీ మీద, చంద్రబాబు మీద ఉన్న అభిమానంతోనే రాఘవేంద్ర రావు ఈ వ్యాఖ్యలు చేశారా? లేదా టీడీపీ అధికారంలోకి వస్తే ఖాళీగా ఉన్న తనకు ఏదైనా పదవి దొరుకుతుందని అనుకుంటున్నారా?