ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనా పగ్గాలు చేపట్టి సరిగ్గా ఇవాళ్టికి నాలుగేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. సీఎం వైఎస్ జగన్‌కు శుభాకాంక్షలు చెబుతూ వివిధ మీడియా సంస్థలకు వైసీపీ నేతలు అడ్వర్‌టైజ్‌మెంట్స్ ఇచ్చారు. అలాగే జగన్ అనుకూల మీడియాలో ప్రభుత్వానికి అనుకూలంగా, ఎల్లో మీడియాలో వ్యతిరేక కథనాలు వెలువడ్డాయి. ఇవన్నీ ఊహించినవే.
సీఎంగా నాలుగేళ్లు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో కనీసం ఒక ట్వీట్ చేసే ఆలోచన కూడా వైఎస్ జగన్‌కు లేకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. సీఎం తరపున సోషల్ మీడియా చూసే నెట్‌వర్క్ వుంటుంది కదా? జగన్ చిరకాల కాంక్ష తీర్చిన ప్రజలకు కృతజ్ఞతలు చెప్పుకునే సంస్కారం కూడా లేకపోవడం ఒకింత ఆశ్చర్యం కలుగుతోంది.
నాలుగేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకోవడం, అలాగే మరో ఏడాదిలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వైఎస్ జగన్ మీడియా ముందుకొచ్చి మాట్లాడి వుంటే బాగుండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు కూడా ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకొచ్చి, నాలుగేళ్ల పాలనపై అభిప్రాయాలు పంచుకోవడం ఏంటనే విమర్శ వెల్లువెత్తుతోంది.
సజ్జల మాట్లాడకూడదనే ఉద్దేశం కాదని, ఇదొక ప్రత్యేకమైన రోజు అని, ఇప్పుడు కూడా జగన్ స్పందించకపోవడం ఏంటనే నిలదీతలు ఎదురవుతున్నాయి. కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే జనంలోకి జగన్ వచ్చి, తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని కోరితే, గంగిరెద్దుల్లా తలూపుతూ ఓట్లు వేయాలా? అని ప్రశ్నించే వాళ్లు లేకపోలేదు.