జనసేనాని పవన్‌కల్యాణ్‌ను మహానాడు వేదిక తీవ్రంగా నిరాశ పరిచింది. ఆంధ్రప్రదేశ్‌లో పవన్‌కల్యాణ్ ఎప్పుడు పర్యటించినా పొత్తులు, జగన్‌ను గద్దె దించడంపై మాట్లాడుతుంటారు. ఆరు నూరైనా, నూరు ఆరైనా టీడీపీతో పొంత్తు వుంటుందని, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ చీలనివ్వనని ఆయన పదేపదే చెప్పడం తెలిసిందే. అయితే పవన్ వ్యాఖ్యలపై మహానాడులో టీడీపీ తగిన రీతిలో స్పందిస్తుందని అందరూ ఊహించారు.
కానీ పొత్తులు, పవన్‌కల్యాణ్ ప్రస్తావన లేకుండానే రెండు రోజుల మహానాడు సంబరం ముగిసింది. దీంతో పవన్‌కల్యాణ్‌ను టీడీపీ అసలు పట్టించుకోలేదనే చర్చ నడుస్తోంది. టీడీపీతో కలిసి పోటీ చేయాలని పవన్‌కల్యాణ్ అనుకుంటున్నప్పుడు, ఉమ్మడి మేనిఫెస్టో తీసుకురావడం రాజకీయంగా మంచి సంప్రదాయం. అయితే అలాంటి సంప్రదాయాన్ని పవన్‌కల్యాణ్ విషయంలో పాటించాల్సిన అవసరం లేదనే రీతిలో టీడీపీ వ్యవహరించిందనే చర్చ నడుస్తోంది.
ఎవరితోనూ సంబంధం లేకుండా టీడీపీ సొంత ఎజెండా, జెండాతో అధికారంలోకి వస్తామనే ధీమాను ప్రదర్శించింది. ఇంత కాలం ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీలనివ్వననే ప్రగల్భాలు పలుకుతున్న పవన్ పరిస్థితి ఏంటనే ప్రశ్న ఉత్పన్నమైంది. తమ వెంట పవన్‌కల్యాణ్ ఎట్టి పరిస్థితుల్లోనూ నడిచేలా రాజకీయంగా టీడీపీ భ్రష్టు పట్టించిందని, ఇక ఆయన్ను అలా వదిలేసిందని అంటున్నారు.
టీడీపీ వెంట తనకు తాను నడిచేలా, ఇచ్చినన్ని సీట్లతో సరిపెట్టుకునేలా పవన్‌ను టీడీపీ తయారు చేసిందనే చర్చకు తెరలేచింది. అందుకే పవన్ అభిప్రాయాలతో సంబంధం లేకుండా టీడీపీ మేనిఫెస్టో తయారు చేసుకుందని అంటున్నారు. ఇంతకాలం జగన్‌పై అవాకులు చెవాకులు పేలుతూ వస్తున్న పవన్‌కల్యాణ్‌కు టీడీపీ వైఖరి జీర్ణించుకోలేకుండా ఉంది. కానీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలోకి తనను తాను నెట్టుకున్నారు. మహానాడులో టీడీపీ వ్యవహరించిన తీరు, జనసేనకు గట్టి ఎదురు దెబ్బ అని చెప్పక తప్పదు.