జనంలో ఉన్నది జగనే…!

విపక్షాలు ఒక్కటి అయ్యాయి. టీడీపీ- జనసేన రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. ఉమ్మడి కార్యాచరణ అంటూ మీటింగులు పెడుతున్నాయి. అయితే ఆ యాక్షన్ ప్లాన్ ఆచరణలోకి రావడంలేదు. వైసీపీ మాత్రం వివిధ రకాలైన కార్యక్రమాలలో…

విపక్షాలు ఒక్కటి అయ్యాయి. టీడీపీ- జనసేన రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. ఉమ్మడి కార్యాచరణ అంటూ మీటింగులు పెడుతున్నాయి. అయితే ఆ యాక్షన్ ప్లాన్ ఆచరణలోకి రావడంలేదు. వైసీపీ మాత్రం వివిధ రకాలైన కార్యక్రమాలలో జనంలోకి వెళ్తోంది.

వైసీపీ హై కమాండ్ వరసబెట్టి ఒక దాని తరువాత మరొకటి అన్నట్లుగా కార్యక్రమాలను డిజైన్ చేస్తోంది. సామాజిక సాధికారిక బస్సు యాత్ర మొదటి దశ పూర్తి అవుతూనే వై ఏపీ నీడ్స్ జగన్ ప్రోగ్రాం స్టార్ట్ చేశారు. బీసీ ఎస్సీ, ఎస్టీ మైనారిటీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజా ప్రతినిధులతో సాగిన సామాజిక బస్సు యాత్రకు ఉత్తరాంధ్రాలో చాలా చోట్ల మంచి స్పందన కనిపించింది. పలాసలో జనాలు విరగబడి వచ్చారు. ఎస్ కోటలో అదే సందడి కనిపించింది. పార్వతీపురంలోనూ ప్రజానీకం పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు చేస్తున్న ప్రసంగాలకు కొన్ని చోట్ల మంచి స్పందన లభిస్తోంది. వైసీపీ వ్యూహాత్మకంగా జనాల్లోకి పార్టీని పంపిస్తోంది. జగన్ రాకపోయినా స్టార్ కాంపెయినర్ లేకపోయినా జనాలు వస్తున్నారు. మంత్రుల సభలకు జనం తరలిరావడం, ఎమ్మెల్యేలు ఇతర నేతలు పార్టీని ముందుండి నడిపించడం చూస్తూంటే జగన్ ఫోటోలే చాలు ఆకట్టుకోవడానికి అన్నట్లుగానే ఉంది అంటున్నారు.

ఇటీవల శ్రీ సత్యసాయి జిల్లా పర్యటనలో జగన్ ఇదే మాట అన్నారు. సామాజిక బస్సు యాత్ర విజయవంతంగా సాగుతోందని జన సందోహం ఎక్కడ చూసినా కనిపిస్తోందని చెప్పారు. అధినాయకుడు చుట్టూ పార్టీ తిరగడం ఒక విధానం అయితే పార్టీని జనం చుట్టూ తిప్పడం మరో స్టైల్. జగన్ ఆ రెండవ మార్గం ఎంచుకున్నారు. అందుకే జనంలో జగన్ కనిపిస్తున్నారు అన్నది ఒక విశ్లేషణగా ఉంది.