వైసీపీ మంత్రి గారి మీద విపక్షం గురి

ఉమ్మడి విశాఖ జిల్లాలోని మాడుగుల నియోజకవర్గం రాజకీయంగా విశిష్టత కలిగి ఉంది. ఈ నియోజకవర్గం ఒకపుడు టీడీపీకి కంచుకోట. 2014 నుంచి పరిస్థితి మారింది. వైసీపీ మాడుగులలో పాగా వేసింది. 2014, 2019లలో బూడి…

ఉమ్మడి విశాఖ జిల్లాలోని మాడుగుల నియోజకవర్గం రాజకీయంగా విశిష్టత కలిగి ఉంది. ఈ నియోజకవర్గం ఒకపుడు టీడీపీకి కంచుకోట. 2014 నుంచి పరిస్థితి మారింది. వైసీపీ మాడుగులలో పాగా వేసింది. 2014, 2019లలో బూడి ముత్యాలనాయుడు వరుసగా గెలుస్తూ వస్తున్నారు.

ఆయన 2024లో కూడా గెలుస్తానని ధీమాగా ఉన్నారు. ఆయన వైసీపీ ప్రభుత్వంలో కీలక మంత్రిత్వ శాఖలను చూస్తూ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. ఈసారి విశాఖ జిల్లాలో వైసీపీ గెలిచే సీట్లలో మొదట చెప్పుకునేది మాడుగులనే అని పార్టీ సైతం భావిస్తోంది.

మాడుగులలో బూడిని ఓడించాలని టీడీపీ చూస్తోంది. జనసేన పొత్తు కూడా కలిసి రావడంతో ఈ నియోజకవర్గంలో అవకాశాలు పెరుగుతాయని అంచనా వేసుకుంటోంది. అయితే బూడి జెడ్పీటీసీ నుంచి ఎమ్మెల్యే అయిన వారు. క్షేత్ర స్థాయిలో పట్టు ఉన్న వారు.

విపక్షంలో ఈ రోజుకీ ఎవరు అభ్యర్ధి అన్నది తెలియకపోవడం బూడికి అనుకూలించే అంశంగా ఉంది. బూడి నియోజకవర్గంలోనే సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ప్రజలతో మమేకం అవుతున్నారు. బూడిని ఓడించడం కష్టమే అయినప్పటికీ విపక్షం ఈ బిగ్ టాస్క్ ని స్వీకరించేందుకు సిద్ధంగా ఉంది  అని   అంటున్నారు.

ప్రతిపక్షం ఎన్ని పొత్తులతో వచ్చినా గెలిచేది ముత్యాలనాయుడే అని ఆయన అనుచరులు అంటున్నారు. ఇంతకీ బూడి మీద ప్రత్యర్ధి ఎవరో తెలియక విపక్ష శిబిరం అయోమయంలో ఉండడమే తమ విజయం అని అంటున్నారు. బూడిని టార్గెట్ చేస్తున్న ప్రతిపక్షానికి ఈసారి మాడుగుల చిక్కుతుందా అన్నది రాజకీయంగా హాట్ టాపిక్ గా ఉంది.