మేమంతా సిద్ధం బస్సు యాత్రకు వైఎస్సార్‌సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెడీ అయ్యారు. విజయవాడలో బస్సుయాత్రలో వుండగా శనివారం రాత్రి ఆయనపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఎడమ కంటి పైభాగాన ఆయనకు గాయాలయ్యాయి. మూడు రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. కానీ ఆయన ఒక రోజు విశ్రాంతి అనంతరం తిరిగి ప్రజల్లోకి వెళ్లేందుకు సమాయత్తం అయ్యారు.
ఇవాళ ఉదయం 9 గంటలకు కేసరిపల్లి దగ్గరి నుంచి యాత్ర పునఃప్రారంభమవుతుంది. గన్నవరం మీదుగా యాత్ర సాగుతుంది. సాయంత్రానికి ఆయన గుడివాడ చేరుకుంటారు. కొడాలి నాని అడ్డా గుడివాడలో సాయంత్రం నిర్వహించనున్న బహిరంగ సభలో జగన్ ప్రసంగించనున్నారు. తనపై జరిగిన దాడిపై జగన్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
ఎన్నికలకు రోజులు దగ్గరపడుతున్న కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య డైలాగ్ వార్ ఓ రేంజ్‌కు చేరుకుంది. పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జగన్‌పై దాడి ఏపీ రాజకీయాల్ని మరింత వేడెక్కించింది.
ఇదంతా డ్రామా అంటూ ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారు. మరోవైపు జగన్‌పై దాడికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహించారు.