ఆంధ్రప్రదేశ్ లో కరెంట్ కోతలు దారుణంగా ఉన్నాయి. ఎవరు ఔనన్నా, కాదన్నా ఇది వాస్తవం. దీన్ని కప్పిపుచ్చడానికి లేదు. సాకులు చెప్పి తప్పించుకోవడానికి లేదు. ప్రజలకు ప్రభుత్వంపై ఇనిస్టెంట్ గా అసంతృప్తి వచ్చేది ఇక్కడే. ఇంట్లో కరెంట్ లేకపోతే, ప్రభుత్వాన్నే తిట్టుకుంటారు. ప్రస్తుతం ఏపీలో అలాంటి అసంతృప్తే ప్రభుత్వంపై నివురుగప్పిన నిప్పులా ఉంది. దీన్ని వెంటనే సరిచేయాల్సిందే. లేదంటే ఎన్ని నవరత్నాలు ఇచ్చినా కరెంట్ కోతల అసంతృప్తి ముందు దిగదుడుపే.
ఈ విషయంలో చంద్రబాబు డిస్కమ్ లకు 22వేల కోట్ల రూపాయలు బకాయి పడ్డారంటూ ఆరోపణలు చేస్తూ తప్పించుకోవాలని వైసీపీ చూస్తోంది. చంద్రబాబు గతంలో చేసిన తప్పులు, ఇప్పుడు తమకు చుట్టుకున్నాయని వాళ్లు అంటున్నారు. ఈ ఒక్క అంశంలో మాత్రం ఇది సరైన ఆరోపణ కాదు. చంద్రబాబు తప్పులు చేసి ఉండొచ్చు. కానీ విద్యుత్ విషయంలో వాటిని వెంటనే సరిదిద్దాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వానిది.
ఈ విషయంలో తెలంగాణ మోడల్ ను ఆదర్శంగా తీసుకోవాలి. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో కరెంట్ కష్టాలు అనివార్యమయ్యాయి. దీనిపై అప్పట్లో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు కేసీఆర్. పొరుగు రాష్ట్రాలు, కేంద్రంతో మాట్లాడి ఒప్పందాలు చేసుకున్నారు. ప్రత్యేకంగా లైన్లు వేశారు. తెలంగాణ ప్రజల్ని కరెంట్ కష్టాల నుంచి బయట పడేశారు. ఇలాంటి చర్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా అవసరం. నిధుల లేమి లాంటి మాటలు ఇక్కడ చెల్లవు.
రోడ్లు అధ్వాన్నంగా ఉన్నప్పుడు ఎలాగైతే యుద్ధ ప్రాతిపదికన నిధులు కేటాయించి, టెండర్లు పిలిచి రాష్ట్రవ్యాప్తంగా రోడ్లు బాగుచేస్తున్నారో.. అదే యాక్షన్ ప్లాన్ విద్యుత్ కోతల విషయంలో కూడా అవసరం. లేదంటే.. ప్రజల నుంచి నిరసన ఎదుర్కోవాల్సి వస్తుంది. నవరత్నాల లబ్దిదారులే శాపనార్థాలు పెట్టే పరిస్థితి దాపురిస్తుంది.
ప్రస్తుతం పల్లెల్లో రోజుకు 6-7 గంటలు కరెంట్ కోత ఉంటోంది. మండల కేంద్రాల్లో కనీసం 3 గంటలు కట్ చేస్తున్నారు. పరిశ్రమలకు పవర్ హాలిడే ఇస్తున్నారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో కరెంట్ కోతలు పెద్దగా లేవు. ఆయన అప్పు చేశాడా, మేనేజ్ చేశాడా అనేది ఇక్కడ అప్రస్తుతం. ప్రజల్ని వీలైనంత మేరకు కరెంట్ కోతల నుంచి బయట పడేశారు. ఇప్పుడు అదే పనిని జగన్ సర్కార్ కూడా చేసి తీరక తప్పదు. కరెంట్ లేకపోతే ప్రజల్లో వచ్చే అసంతృప్తి అంతాఇంతా కాదు. దాన్ని చల్లార్చడం చాలా కష్టం.
ఇప్పటికే ఏపీలో ఓ మోస్తరుగా కరెంట్ చార్జీలు పెంచారు, సరేలే అనుకున్న టైమ్ లో ఇలా కోతలు కూడా విధిస్తే సామాన్యుడికి ఆగ్రహం కలగడం కామన్. ఇప్పటికే ప్రతిపక్షాలు లాంతర్లు పట్టుకొని ఈ అంశాన్ని హైలెట్ చేస్తున్నాయి. జగన్ ఇక ఏమాత్రం ఆలస్యం చేయడానికి వీల్లేదు, కరెంట్ కోతల్ని ఎంత తొందరగా నివారిస్తే జగన్ సర్కారుకు అంత మంచిది. ఈ విషయంలో చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కంటే, ముందే జాగ్రత్త పడితే అందరికీ మంచిది.