టీడీపీలో ఉంటే పతివ్రత.. బయటకొస్తే మాత్రం..!

బీసీ నేత ఆర్.కృష్ణయ్య టీడీపీలో ఉన్నన్ని రోజులు ఆయన చంద్రబాబు కంటికి మంచి నాయకుడిగా కనిపించారు. బీసీల కోసం కష్టపడే వ్యక్తిగా అనిపించారు. ఆయన గెలుపు కోసం చంద్రబాబు ప్రచారం కూడా చేశారు. అంతేకాదు..…

బీసీ నేత ఆర్.కృష్ణయ్య టీడీపీలో ఉన్నన్ని రోజులు ఆయన చంద్రబాబు కంటికి మంచి నాయకుడిగా కనిపించారు. బీసీల కోసం కష్టపడే వ్యక్తిగా అనిపించారు. ఆయన గెలుపు కోసం చంద్రబాబు ప్రచారం కూడా చేశారు. అంతేకాదు.. ఒక దశలో కృష్ణయ్యను తెలంగాణ సీఎం అభ్యర్థిగా కూడా ప్రకటించారు బాబు. కానీ ఇప్పుడు కృష్ణయ్య టీడీపీ మనిషి కాదు. వైసీపీ రాజ్యసభ సభ్యత్వం ఇస్తామంటోంది. దీంతో చంద్రబాబుకి ఆక్రోషం పొడుచుకొచ్చింది.

అయ్యయ్యో ఆర్.కృష్ణయ్యకు ఆ పదవి ఎలా ఇస్తారంటూ రాద్ధాంతం చేస్తున్నారు బాబు. టీడీపీలో ఉన్నంతసేపు ఆయన దేవుడు, బయటకొచ్చేసరికి బాబుకు దెయ్యంలా కనిపిస్తున్నారు. గతంలో తాను సీఎం అభ్యర్థిగా ప్రకటించిన వ్యక్తికి, ఇప్పుడు మరో పార్టీ రాజ్యసభ సీటు ఇస్తానంటే బాబుకి ఎందుకంత కడుపుమంట. బీసీల్లో చిచ్చుపెట్టడానికి కాకపోతే కృష్ణయ్య విషయంలో అసలు బాబు జోక్యం ఎందుకు..?

ఆమాటకొస్తే బ్యాంకులకు అప్పులు ఎగ్గొట్టినవారిని, వ్యాపారాల్లో నష్టాలు చూపించి ఐపీలు పెట్టినవారిని, వేలకోట్ల మోసాల్లో హస్తం ఉన్నవారిని.. ఇలా ఏరికోరి చంద్రబాబు రాజ్యసభకు పంపించేవారు. సుజనా చౌదరి కంటే ఆర్.కృష్ణయ్య తీసిపోయారా..? సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్.. ఇలా అందరిపై ఆరోపణలున్నాయి. అయినా వారిని చంద్రబాబు రాజ్యసభకు పంపించారు. 

ఇక్కడ పార్టీ ఓడిపోగానే, బీజేపీ చేతిలో తనకు మూడిందని అర్థమైపోయి వారందర్నీ కమలదళంలో కలిపేశారు. మోదీ ముందు చేతులు జోడించారు. రాజ్యసభ సీట్లతో కుర్చీలాట ఆడే చంద్రబాబు కూడా వైసీపీ ఎవరికి సీటు ఇవ్వాలో, ఎవరికి ఇవ్వొద్దో సూచించడం ఈ దశాబ్దపు పెద్ద జోక్.

పార్టీ అధినేత ఏ పని చేసినా.. దానిలో పార్టీ భవిష్యత్తు కనపడుతుంది. భవిష్యత్ వ్యూహాల ప్రకారం నామినేటెడ్ పోస్ట్ లను ఖరారు చేస్తుంటారు. అందులో భాగంగానే జగన్, ఇద్దరు బీసీలను రాజ్యసభకు పంపబోతున్నారు. ఈ వ్యూహంతో మైండ్ బ్లాక్ కావడంతో బాబు ఆర్.కృష్ణయ్యను వేలెత్తి చూపిస్తున్నారు. పోనీ నెల్లూరునుంచి బీదా మస్తాన్ రావుకి సీటు ఎలా ఇస్తారు..? ఆయన మూడేళ్ల క్రితం టీడీపీ టికెట్ పై పోటీ చేశారు కదా అని ప్రశ్నించలేదే..? కృష్ణయ్య విషయంలో విషం చిమ్మితే, బీసీలలో చీలిక తెస్తే.. ఆ గొడవలో తాను చలి కాచుకోవచ్చనేది బాబు కుతంత్రం.

రాజ్యసభ సీట్ల కేటాయింపులో గురివింద నీతి చూపించే చంద్రబాబు, తన హయాంలో స్కాంలు చేసేవారికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేవారు, ఇప్పుడు పక్క రాష్ట్రంవారికి సీట్లెందుకిస్తారంటూ వైసీపీని ప్రశ్నిస్తున్నారు. ఇదెక్కడి లాజిక్ అని మాత్రం మనం ప్రశ్నించకూడదు. ఎందుకంటే, ఆయన నాలుక అంతే. ఎన్ని యూటర్న్ లైనా తీసుకుంటుంది.