ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖ మకాం డేట్ అన్నది నిర్ణయం అయిపోయింది. విజయదశమి రోజున జగన్ విశాఖలో కాలు పెట్టనున్నారు. దాని కంటే ముందు ఆయన విశాఖ అభివృద్ధిని మరో ఎత్తుకు తీసుకుని వెళ్ళేలా ఇన్ఫోసిస్ సెంటర్ కి ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ నెల 16న జగన్ విశాఖకు రానున్నారు.
రుషికొండ సమీపంలో ఇన్ఫోసిస్ క్యాంపస్ ని ఆయన సందర్శించి ప్రారంభోత్సవం చేస్తారు. మొదట వేయి మందికి ఉపాధి అందేలా ఇన్ఫోసిస్ తన డేటా సెంటర్ ని ఏర్పాటు చేసింది. మరి కొంతకాలం తరువాత మరో ఆరు వందల మందికి కూడా ఉద్యోగాలు ఇచ్చేలా విస్తరిస్తారని ఇన్ఫోసిస్ అధికార వర్గాలు తెలిపాయి.
ఇన్ఫోసిస్ తో పాటు మరిన్ని ఐటీ కంపెనీలు విశాఖకు తరలి రానున్నాయని ఏపీలో విశాఖ ఐటీ సిటీ అవుతుందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమరనాధ్ అంటున్నారు. ఇదిలా ఉంటే టెక్ మహేంద్ర గ్రూప్ విశాఖ వైపు చూస్తోంది. విశాఖతో సహా ఏపీలోని మూడు కీలకమైన ప్రాంతాలలో టూరిజం రెస్టారెంట్లను నిర్మిస్తోంది. ఒక్కోదానికి రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని తెలుస్తోంది.
ఈ ప్రాజెక్టుల శంకుస్థాపనను జగన్ తొందరలోనే చేయనున్నారని వైసీపీ వర్గాలు తెలిపాయి. విశాఖకు ఏమి అభివృద్ధి చేశారన్న వారికి తాను రాక ముందే ఆయా ప్రాజెక్టులను ప్రారంభించడం ద్వారా జగన్ జవాబు చెప్పనున్నారని అంటున్నారు.