ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత ఎక్కువగా దృష్టి పెట్టింది విద్యారంగంపైన్నే. ప్రపంచీకరణ నేపథ్యంలో పోటీ సమాజంలో రాణించాలంటే ప్రతి ఒక్కరికీ ఇంగ్లీష్ విద్య అవసరమని జగన్ గట్టిగా నమ్మారు.
ఇంగ్లీష్ మీడియంలో చదవడం డబ్బున్న వాళ్లకు మాత్రమే సాధ్యమయ్యే పనిగా ఒక అభిప్రాయం వుంది. ఈ నేపథ్యంలో బడుగు, బలహీన వర్గాల పిల్లలకి ఇంగ్లీష్ మీడియంలో చదువు చెప్పిస్తే ఉజ్వల భవిష్యత్ అందించిన వాళ్లమవుతామని సీఎం జగన్ భావించారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశ పెట్టేందుకు జగన్ నిర్ణయించారు. ఇందుకు అనేక ప్రతికూల అంశాలు తోడయ్యాయి. వివిధ రాజ్యాంగ వ్యవస్థల ద్వారా ప్రభుత్వ ఆశయాన్ని అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతూనే వున్నాయి. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం కుట్రదారుల ఎత్తుకు పైఎత్తులేస్తూ… ముందుకు సాగుతోంది.
ఈ నేపథ్యంలో జగన్ ఆశయంపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కడప జిల్లా ప్రొద్దుటూరు సీబీఐటీలో శనివారం వైసీపీ ఆధ్వర్యంలో మెగాజాబ్ మేళా నిర్వహించారు. జాబ్‌మేళాను ప్రారంభించిన విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఉన్నతంగా చదవాలనేదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆశయమన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగి వుండకూడదని తమ పార్టీ లక్ష్యమన్నారు.
విద్య ప్రతి ఒక్కరి అవసరమన్నారు. ఉద్యోగాల కోసం ప్రతి ఒక్కరూ పోటీ పడుతున్న పరిస్థితుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా అవసరమన్నారు. ఉద్యోగం పొందితేనే కుటుంబాలు ఆర్థికంగా ఎదుగుతాయన్నారు. ఇంటర్వ్యూలను ధైర్యంగా ఎదుర్కొవాలని, ఇప్పుడు రానంత మాత్రాన నిరాశ పడొద్దన్నారు. మళ్లీ అవకాశం ఉంటుందన్నారు. బాబ్ మేళా నిరంతర ప్రక్రియ అని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు.