రాజధానిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యూహం ఎవరికీ అంతుచిక్కడం లేదు. అసెంబ్లీ సమావేశాల్లో మొదటి రోజే మూడు రాజధానుల బిల్లు తీసుకొస్తారనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. దీంతో ఏ రూపంలో తీసుకొస్తారో అనే ఉత్కంఠ నెలకుంది. ఈ నేపథ్యంలో బిల్లు విషయానికి ఆయన వెళ్లలేదు. కేవలం వికేంద్రీకరణపై స్వల్ప కాలిక చర్చకే పరిమితం కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
మరోవైపు ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖలో ఎగ్జిక్యూటివ్ రాజధాని ఏర్పాటు చేసి తీరుతామని మంత్రులు, వైసీపీ ముఖ్య నేతలు పదేపదే స్పష్టం చేస్తున్నారు. దీంతో ఇవాళ్టి అసెంబ్లీ సమావేశాల్లో ఆ దిశగా ముందడుగు పడొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ మూడు రాజధానుల బిల్లులు చట్ట విరుద్ధమని, అసలు రాజధానిని ఎంపిక చేసే హక్కు అసెంబ్లీకి లేదని హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వం మళ్లీ అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు తీసుకొచ్చి, రాజ్యాంగ సంక్షోభానికి తెరలేపుతుందా? అనే చర్చ జరిగింది.
కానీ వికేంద్రీకరణపై చర్చలో భాగంగా ఏ ఒక్క అధికార పార్టీ సభ్యుడు న్యాయస్థానం ఊసే ఎత్తకపోవడం గమనార్హం. న్యాయ స్థానంతో ఘర్షణకు దిగే ఆలోచన లేనట్టు ఇవాళ్టి చర్చతో తేలిపోయింది. చర్చలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ సుదీర్ఘ ఉపన్యాసం చేశారు. చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అమరావతిపై తనకెలాంటి కోపం లేదని చెప్పుకొచ్చారు.
అభివృద్ధి చేయని, చేయలేని ప్రాంతం గురించి ఉద్యమం పేరుతో డ్రామాలు చేస్తున్నారని ముఖ్యమంత్రి జగన్ మండిపడ్డారు. కట్టని రాజధాని గురించి, కట్టలేని గ్రాఫిక్స్ గురించి ఉద్యమాలా అని నిలదీశారు. 1956 నుంచి 2014 వరకు గత 58 ఏళ్లలో చంద్రబాబు ఎప్పుడూ ఉద్యమాలు చేసిన పాపాన పోలేదన్నారు. వెయ్యి రోజులుగా కృత్రిమ, రియల్ ఎస్టేట్ ఉద్యమం నడిపిస్తున్నారని చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి అభివృద్ధి కోసం ఈ ఉద్యమాలు? అని ప్రశ్నించారు.
రాజధాని నిర్మాణానికి 4 నుంచి 5 లక్షల కోట్లు కావాలని చంద్రబాబే అన్నారని జగన్ గుర్తు చేశారు. బాబు హయాంలో ఏడాదికి వెయ్యి కోట్లు కూడా ఖర్చు పెట్టలేదన్నారు. రాజధాని కోసం అంతకంటే ఎక్కువ నిధులు ఖర్చు చేయలేకపోయారన్నారు. అమరావతి రాజధానిని ఎక్కడికీ తరలించడంలేదని స్పష్టం చేశారు. విశాఖ, కర్నూలులో కూడా రాజధానులు పెడతామని చెప్పామన్నారు. ప్రాంతాల మధ్య ఘర్షణ పెట్టేందుకు చంద్రబాబు పాదయాత్ర చేయిస్తున్నారన్నారు. విశాఖకు పరిపాలన రాజధాని వద్దంటూ ఉత్తరాంధ్రకు పాదయాత్రగా వెళితే అక్కడి ప్రజలు ఊరుకుంటారా? అని ప్రశ్నించారు.
చంద్రబాబు ఇదే రకమైన విద్వేష రాజకీయాలు చేస్తే రానున్న ఎన్నికల్లో కనీసం 23 సీట్లు కూడా రావని హెచ్చరించారు. చంద్రబాబు, దుష్టచతుష్టయాన్ని మార్చడం ఎవరి వల్లా కాదన్నారు. పాదయాత్రను స్పాన్సర్ చేస్తోంది చంద్రబాబే అని స్పష్టం చేశారు.
ఇంటింటికీ, మనిషిమనిషికీ మంచి చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యంగా సీఎం జగన్ స్పష్టం చేశారు. అయితే రాజధానిపై ప్రభుత్వ కార్యాచరణ ఎలా వుంటుందో జగన్ చెప్పలేదు. కేవలం అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ తమ ప్రభుత్వ విధానమని, అందులో భాగంగానే మూడు రాజధానులను తెచ్చినట్టు జగన్ చెప్పుకొచ్చారు.