త్వరలోనే జనసేనాని పవన్‌కల్యాణ్ ముసుగుకు తెర తొలగనుంది. ఈ విషయాన్ని జనసేన ముఖ్య నాయకుడు నాదెండ్ల మనోహర్ చెప్పారు. ప్రధాని మోదీతో భేటీ తర్వాత పవన్‌కల్యాణ్‌లో మార్పు వచ్చినట్టు కనిపించింది. అయితే అది మూణ్ణాళ్ల ముచ్చటే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీతో కలిసి వెళ్లేందుకే ఆయన మొగ్గు చూపుతున్నట్టు ….తాజాగా నాదెండ్ల మనోహర్ మాటలు వింటే అర్థమవుతుంది.
పొత్తులపై త్వరలో ప్రకటిస్తామని నాదెండ్ల చెప్పారు. ఇప్పటంలో జనసేన ఆవిర్భావ సభలో పవన్ వ్యాఖ్యలను ఆయన గుర్తు చేయడం గమనార్హం. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశే లక్ష్యమని ఇప్పటం గ్రామ సభలో పవన్ తన ఎజెండాను వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా బాధ్యత తీసుకుంటానని పవన్ చెప్పడాన్ని మనోహర్ మరోసారి ప్రస్తావించడాన్ని గమనించొచ్చు.
ఆ మాటకు పవన్ కట్టుబడి వుంటారని నాదెండ్ల పరోక్షంగా చెప్పినట్టైంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనంటే… టీడీపీ, బీజేపీతో కలిసి పోటీ చేయడమే పవన్ లక్ష్యమని మనోహర్ మరోసారి చాటి చెప్పారు. అయితే పవన్‌తో కలిసి వెళ్లడంపై ఇటీవల కాలంలో టీడీపీ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. చంద్రబాబు సభలకు జనం వెల్లువెత్తుతున్నారని టీడీపీ భావిస్తోంది. దీంతో తమకు ఎవరి అవసరం లేదనే ఆలోచనలో టీడీపీ నేతలున్నారు.
ఒకవేళ జనసేనతో పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీ అడుగుతున్నట్టు 25 నుంచి 40 సీట్లను త్యాగం చేయాల్సి వస్తుందని ఆందోళన టీడీపీలో వుంది. కానీ పార్టీ నిర్మాణమే చేసుకోని పవన్‌కల్యాణ్, టీడీపీతో పొత్తు లేకపోతే కనీసం తాను కూడా గెలవలేననే భయాందోళనలో వున్నారు. దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వననే నినాదంతో టీడీపీకి చేరువ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.
వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత, ఇదే సందర్భంలో టీడీపీపై సానుకూలత పెరిగిందని నమ్ముతున్న చంద్రబాబు… పవన్‌ను ఏ విధంగా కట్టడి చేస్తారో చూడాలి. ఎందుకంటే ఇప్పటికే చంద్రబాబు అభ్యర్థుల ఎంపికను వేగవంతం చేశారు. జనసేనతో పొత్తు కొత్త సమస్య సృష్టికి మూలం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత చంద్రబాబుపై వుంది.