ప్యాకేజీపై జ‌న‌సేన‌లో బ‌ల‌ప‌డ్డ అనుమానాలు!

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను ప్యాకేజీ స్టార్ అని వైసీపీ తీవ్రంగా విమ‌ర్శిస్తూ వుంటుంది. ఇటీవ‌ల రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లో చంద్ర‌బాబుతో ములాఖ‌త్ అయి, ప్యాకేజీ డీల్ మాట్లాడుకున్న త‌ర్వాతే అధికారికంగా పొత్తు ప్ర‌క‌ట‌న చేశార‌ని వైసీపీ…

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను ప్యాకేజీ స్టార్ అని వైసీపీ తీవ్రంగా విమ‌ర్శిస్తూ వుంటుంది. ఇటీవ‌ల రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లో చంద్ర‌బాబుతో ములాఖ‌త్ అయి, ప్యాకేజీ డీల్ మాట్లాడుకున్న త‌ర్వాతే అధికారికంగా పొత్తు ప్ర‌క‌ట‌న చేశార‌ని వైసీపీ తీవ్ర ఆరోప‌ణ‌లు చేస్తోంది. వైసీపీ ప్యాకేజీ ఆరోప‌ణ‌లు నిజ‌మేనా? అని తాజాగా జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు అనుమానించే ప‌రిస్థితి.

జ‌న‌సేన విస్తృత‌స్థాయి స‌మావేశంలో ప‌వ‌న్ కామెంట్స్ ప్యాకేజీపై అనుమానాల్ని మ‌రింత బ‌ల‌ప‌రుస్తున్నాయి. ప‌వ‌న్ ఏమ‌న్నారంటే…”40 ఏళ్ల అనుభ‌వం ఉన్న టీడీపీ ఒక మాట అన్నా నొచ్చుకోవ‌ద్దు. ఎవ‌రైనా బ‌ల‌హీనంగా ఉన్నార‌ని, జైల్లో ఉన్నార‌ని త‌క్కువ అంచ‌నా వేయ‌వ‌ద్దు. టీడీపీ నాయ‌కుల‌ను ఎక్క‌డా కించ‌ప‌ర‌చొద్దు” అని ప‌వ‌న్‌క‌ల్యాణ్ త‌న పార్టీ నాయ‌కుల‌కు దిశానిర్దేశం చేశారు.

టీడీపీని అవ‌మానించొద్ద‌నే వ‌ర‌కూ అంద‌రూ అంగీక‌రిస్తున్నారు. కానీ టీడీపీకి నాలుగు ద‌శాబ్దాల రాజ‌కీయ చ‌రిత్ర వుంద‌ని, అందువ‌ల్ల ఆ పార్టీ నేత‌లు తిట్టినా త‌లొంచుకుని పోవాల‌ని ప‌వ‌న్ ఆదేశించ‌డాన్ని జ‌న‌సేన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఔన‌న్నా, కాద‌న్నా జ‌న‌సేన‌తో పొత్తు వ‌ల్ల అత్య‌ధికంగా ల‌బ్ధి పొందేది టీడీపీనే అని ఆ పార్టీ నాయ‌కులు చెబుతున్నారు.

రాజ‌కీయంగా ల‌బ్ధి పొందే టీడీపీ అణుకువ‌గా ఉండాల‌ని చెప్ప‌డానికి బ‌దులు, త‌మ నాయ‌కులే తిట్లు తిన్నా తుడుచుకెళ్లాల‌ని ఆదేశించ‌డంలో మ‌త‌ల‌బు ఏంటో అర్థం కాలేద‌ని జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు అంటున్నారు. ఇంత కాలం గౌర‌వ‌ప్ర‌ద‌మైన సీట్లు ఇస్తేనే పొత్తు వుంటుంద‌ని న‌మ్మ‌బ‌లుకుతూ వ‌చ్చిన ప‌వ‌న్‌, ఇప్పుడు అందుకు విరుద్ధంగా మాట్లాడ్డం ద్వారా ప్యాకేజీ ఆరోప‌ణ‌లు నిజ‌మ‌ని న‌మ్మే ప‌రిస్థితిని క‌ల్పించిన‌ట్ట‌యింద‌ని వాపోతున్నారు.

పొత్తు అంటే, రెండు పార్టీలు ప‌ర‌స్ప‌రం గౌర‌వించుకోవ‌డం రాజ‌కీయ ధ‌ర్మ‌మ‌ని, కానీ నాలుగు ద‌శాబ్దాల రాజ‌కీయ చ‌రిత్ర క‌లిగిన టీడీపీ ఒక తిట్టు తిట్టినా ప‌డాల‌ని ప‌వ‌న్ ఆదేశించారంటే, ఆర్థిక లావాదేవీలేవో జ‌రిగాయ‌ని అనుమానించాల్సి వ‌స్తోంద‌ని జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు త‌మ అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో మాట్లాడుకుంటున్నారు. మ‌రోవైపు టీడీపీ నేత‌లు ప‌వ‌న్ కామెంట్స్‌పై హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. 

టీడీపీపై జ‌న‌సేన నాయ‌కులు ఇక‌పై అవాకులు చెవాకులు పేల‌ర‌ని, వారి నోళ్ల‌ను తాము మూయించాల్సిన అవ‌స‌రం రాద‌ని, అంతా ప‌వ‌నే చూసుకుంటున్నార‌ని వారు అంటున్నారు. పొత్తుతో ప‌వ‌న్‌కు భారీగా ల‌బ్ధి క‌లిగిన‌ట్టుంద‌ని, త‌మ‌కు లాభం ఏంట‌ని, తిట్లను ఎందుకు ప‌డాల‌ని కొంద‌రు జ‌న‌సేన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ప్ర‌శ్నిస్తున్నారు.