పాపం వంశీ అని అనిపించకమానదు. ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలన్న కోరికతో బంగారం లాంటి ఎమ్మెల్సీ పదవిని నాలుగేళ్ల పదవీ కాలాన్ని వదులుకుని మరీ జనసేనలో చేరారు. జనసేన తూర్పు నియోజకవర్గం ఇస్తుందని అనుకుంటే విశాఖ సౌత్ ని కేటాయించింది.
అక్కడ వంశీక్రిష్ణ తన ప్రచారం మొదలెట్టారో లేదో జనసేన స్థానిక నేతలు ఆయనను వ్యతిరేకిస్తున్నారు. నాన్ లోకల్ ని సౌత్ కి తెచ్చి టికెట్ ఇస్తే మేము ప్రచారం ఎలా చేస్తామని వీర మహిళలతో పాటు జనసేన నేతలు ప్రశ్నిస్తున్నారు.
అయిదేళ్ల పాటు స్థానికంగా ఉంటూ పార్టీ బలోపేతం కోసం పనిచేసిన వారు చాలా మంది ఉన్నారని వారిలో ఎవరికి టికెట్ ఇచ్చినా తాము గెలిపిస్తామని అంటున్నారు. వంశీ వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చారని, పార్టీ జెండా పట్టలేదని అలాంటి వారికి టికెట్ ఇస్తే మొదటి నుంచి పార్టీలో ఉన్న వారి సంగతేంటి అని కూడా ప్రశ్నిస్తున్నారు.
ఇంకాస్తా ముందుకెళ్ళి ఓడిపోయే నేతకు టికెట్ ఇస్తారా అని కూడా జనసేన అధినాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. వంశీ విశాఖ తూర్పులో రెండు సార్లు ఓటమి పాలు అయ్యారు. ఆ సంగతిని జనసేన నేతలు ఈ సమయంలో గుర్తుకు తెస్తున్నారు. వంశీకి టికెట్ వద్దు అంటూ జనసేనలో రచ్చ చేస్తున్నారు.
అసలే జనసేనకు విశాఖ సౌత్ టికెట్ ఇచ్చారని టీడీపీ తమ్ముళ్ళు మండిపోతూంటే జనసేనలోనూ వంశీకి వ్యతిరేకంగా గొంతులు లేస్తున్నాయి. ఈ విషయంలో అధినాయకత్వం ఏమి చేస్తుందో చూస్తామని జనసేన నేతలు అంటున్నారు.
జనసేన టీడీపీ మధ్య విభేదాలు ఉన్నాయి. ఆశావహులు రెండు చోట్లా ఉన్నారు. తూర్పు నుంచి వంశీని తెచ్చి పెట్టడంతో సౌత్ లో కూటమిలో కుంపట్లు మొదలయ్యాయని అంటున్నారు. దీనిని చక్కదిద్దినా మనసులు కలవని చోట రెండు పార్టీలు వంశీని గెలిపిస్తాయా లేదా అన్నది ఆయన అభిమానులలో టెన్షన్ పెడుతోంది.