బండారు ఫ్యాన్ నీడన సేదతీరుతారా?

టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి వైసీపీలో చేరుతారు అన్నది గత రెండు రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారంగా ఉంది. ఆయన ఆశించిన పెందుర్తి టికెట్ జనసేనకు వెళ్ళిపోయింది. దాంతో…

టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి వైసీపీలో చేరుతారు అన్నది గత రెండు రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారంగా ఉంది. ఆయన ఆశించిన పెందుర్తి టికెట్ జనసేనకు వెళ్ళిపోయింది. దాంతో బండారు రగిలిపోతున్నారు. తన సీనియారిటీని కూడా అధినాయకత్వం గుర్తించలేదని ఆయన మండిపడుతున్నారు.

తనకు ఇదే లాస్ట్ చాన్స్ అని చెప్పినా సెంటిమెంట్ ని కూడా పట్టించుకోలేదని ఆయన ఆవేదన చెందుతున్నారు. బండారు అనుచరులు అయితే టీడీపీకి అల్టిమేటం జారీ చేస్తున్నారు. వీధులలోకి వచ్చి నిరసనలు తెలియచేస్తున్నారు. బండారుకి టికెట్ ఇవ్వాల్సిందే అని అంటున్నారు.

బండారు తన రాజకీయ భవిష్యత్తుతో పటు కుమారుడి రాజకీయం గురించి కూడా ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. ఈ కీలక సమయంలో వైసీపీ నేతలకు ఆయన టచ్ లోకి వచ్చారు అని అంటున్నారు. బండారుని అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయించేందుకు వైసీపీ నుంచి వర్తమానం వచ్చిందని అంటున్నారు.

బలమైన వెలమ సామాజిక వర్గానికి చెందిన బండారుకు టికెట్ ఇస్తే ఆయన గెలుపు ఖాయమని కూడా వైసీపీ పెద్దలు అంచనా వేస్తున్నారు. ఆయన వెంట మూడు నాలుగు నియోజకవర్గాల నుంచి తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళు కూడా వస్తారని అంటున్నారు.

బండారుకు వైసీపీలో చేరాలని ఉంది. కానీ ఆయన అల్లుడు శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు టీడీపీలో కీలకంగా ఉన్నారు. ఆయనను చూసి వెనక్కి తగ్గుతున్నారు అని అంటున్నారు. అయితే రాజకీయాల్లో ఎవరి దారి వారిదే అని అంటున్నారు. బండారు తన కుమారుడి రాజకీయ జీవితం కోసం ఎంతటి నిర్ణయం అయినా తీసుకోవడానికి సిద్ధం అని ఆయన అనుచరులు అంటున్నారు.

అనూహ్యమైన పరిణామాలు జరిగి పెందుర్తి టికెట్ బండారుకు కేటాయిస్తే తప్ప ఆయన వైసీపీలోకి చేరిపోవడం ఖాయమని అంటున్నారు. బండారు టీడీపీని వీడుతారు అన్న వార్తల క్రమంలో ఆ పార్టీ నేతలు ఆయనను కలుసుకుని తొందర పడవద్దని నచ్చచెబుతున్నట్లుగా భోగట్టా. బండారు కనుక పార్టీని వీడితే నాలుగు దశాబ్దాలుగా టీడీపీలో ఉన్న బిగ్ షాట్ షాక్ ఇచ్చినట్లే అని అంటున్నారు.